Panchadara Kommulu : మనం పంచదారను ఉపయోగించి రకరకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. పంచదారను ఉపయోగించే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. పంచదార శరీరానికి హానిని కలిగిస్తుంది కనుక అప్పుడప్పుడూ మాత్రమే దీనితో వంటకాలను తయారు చేసుకుని తీసుకోవాలి. పంచదారతో చేసుకోదగిన వంటకాల్లో పంచదార కొమ్ములు ఒకటి. ఈ కొమ్ములు తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ పంచదార కొమ్ములను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పంచదార కొమ్ములు తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – 2 కప్పులు, ఉప్మా రవ్వ – పావు కప్పు, ఉప్పు – కొద్దిగా, వేడి నూనె – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, పంచదార – ఒకటిన్నర కప్పు, నీళ్లు – అర కప్పు, యాలకుల పొడి – అర కప్పు.
పంచదార కొమ్ములు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి, ఉప్మా రవ్వ, ఉప్పు వేసి కలపాలి. తరువాత నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని రెండు భాగాలుగా చేసి పొడి పిండి చల్లుకుంటూ పావు ఇంచు మందంతో చపాతీలా రుద్దుకోవాలి. తరువాత ఈ చపాతీ అంచులను తీసేసి చతురస్రాకారంలో కట్ చేసుకోవాలి. తరువాత ఈ చపాతీని మరలా అడ్డంగా రెండు భాగాలుగా చేసుకోవాలి. తరువాత ఒక దాని మీద మరొకటి ఉంచి నిలువుగా ముక్కలుగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో కట్ చేసుకున్న గోధుమ పిండి ముక్కలను వేసి మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత ఒక గిన్నెలో లేదా కళాయిలో పంచదార, నీళ్లు, యాలకుల పొడి వేసి వేడి చేయాలి. పంచదార కరిగి ముదురు పాకం వచ్చే వరకు ఉడికించాలి. పంచదార మిశ్రమాన్ని నీటిలో వేసి చూస్తే కొద్దిగా ముద్దగా రావాలి. ఇలా పాకం తయారయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని గోధుమ పిండి కొమ్ములపై వేసుకోవాలి. తరువాత కొమ్ములకు పాకం పట్టేలా బాగా కలుపుకోవాలి. పంచదార పాకం తయారయిన తరువాత గట్టిగా తయారవుతుంది. ఇలా చేయడం వల్ల పంచదార కొమ్ములు తయారవుతాయి. తీపి తినాలనిపించినప్పుడు, పండుగలకు ఇలా పంచదార కొమ్ములను తయారు చేసుకుని తినవచ్చు. ఈ కొమ్ములను మనం బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. రుచిగా కరకరలాడుతూ ఉండే ఈ పంచదార కొమ్ములను అందరూ ఇష్టంగా తింటారు.