Paneer Paratha : పరాటాలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. పరాటాలను ఏదైనా కూరతో తింటే బాగుంటాయి. అలాగే ఆలు పరాటాలను కూడా చేస్తారు. వీటిని టమాటా చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది. అయితే మనం పనీర్ పరాటాలను కూడా చేసుకోవచ్చు. పనీర్ అంటే ఇష్టంగా తినేవారు ఈ పరాటాలను కూడా ఇష్టంగా తింటారు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి. వీటిని చేయడం కూడా సులభమే. ఇక పనీర్ పరాటాలను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ పరాటాల తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – ఒకటిన్నర కప్పు, పనీర్ తురుము – 200 గ్రాములు, ఉప్పు, నూనె – తగినంత, కారం – 1 టీస్పూన్, ఉల్లిపాయ – 1, పచ్చి మిర్చి – 2 (సన్నగా తరగాలి), చీజ్ – పావు కప్పు, చాట్ మసాలా, గరం మసాలా – పావు టీస్పూన్ చొప్పున, ఇంగువ – చిటికెడు, కొత్తిమీర తరుగు – ఒక టీస్పూన్.
పనీర్ పరాటాలను తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, నూనె వేసి కలపాలి. నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలిపి ఓ వస్త్రాన్ని కప్పి పక్కన పెట్టాలి. మరో గిన్నెలో పనీర్ తురుము, చీజ్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి తరుగు, చాట్ మసాలా, గరం మసాలా, ఇంగువ, ఉప్పు, కారం, కొత్తిమీర తరుగు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని తీసుకుని మందమైన పూరీలా చేసి చిన్న గిన్నెలా చేసి పనీర్ మిశ్రమాన్ని మధ్యలో పెట్టి అన్ని వైపులా మూసేయాలి. దాన్ని నెమ్మదిగా చపాతీలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పరాటాలను పెనంపై వేసి రెండు వైపులా నెయ్యి లేదా నూనె వేస్తూ బాగా కాల్చాలి. అంతే.. రుచికరమైన పనీర్ పరాటాలు రెడీ అవుతాయి. వీటిని నేరుగా తినవచ్చు. లేదా ఏదైనా చట్నీ, కూర, పెరుగు పచ్చడితో తింటే బాగుంటాయి. ఎప్పుడూ చేసే పరాటాలకు బదులుగా ఇలా ఓసారి పనీర్ పరాటాలను చేసి తినండి. ఎంతో రుచిగా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి. ఒక్కసారి తింటే మళ్లీ కావాలంటారు.