Paneer Pulao : మనం పనీర్ ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పనీర్ లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. పనీర్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పనీర్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. పనీర్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో పనీర్ పులావ్ ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా పనీర్ పులావ్ ను సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. అలాగే ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా ఉండదు. కేవలం అర గంటలోనే దీనిని మనం తయారు చేసుకోవచ్చు. పనీర్ తో రుచిగా పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, లవంగాలు – 5, దంచిన యాలకులు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, బిర్యానీ ఆకు – 1, సాజీరా – ఒక టీ స్పూన్, పొడుగ్గా సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – కప్పుంపావు, గంట పాటు నానబెట్టిన బాస్మతి బియ్యం – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, పనీర్ ముక్కలు – 150 గ్రా..
పనీర్ పులావ్ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత పచ్చిమిర్చి వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, గరం మసాలా వేసి కలపాలి. వీటిని చక్కగా వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత బియ్యం, కొత్తిమీర, పుదీనా, పనీర్ ముక్కలు వేసి నెమ్మదిగా కలపాలి. తరువాత కుక్కర్ పై మూతను ఉంచి పెద్ద మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత మూత తీసి పర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పనీర్ పులావ్ తయారవుతుంది. దీనిని రైతా, మిర్చి కా సాలన్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా పనీర్ తో పులావ్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.