Papaya Cabbage Salad : బొప్పాయి క్యాబేజి సలాడ్.. బొప్పాయి, క్యాబేజితో చేసే ఈ సలాడ్ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవడానికి లేదా రాత్రి భోజనంగా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ సలాడ్ ను తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ సలాడ్ ను తయారు చేయడం చాలా సులభం. కేవలం 5 నిమిషాల్లోనే ఈ సలాడ్ ను తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ బొప్పాయి క్యాబేజి సలాడ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి క్యాబేజి సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, క్యాబేజి తరుగు – ముప్పావు కప్పు, పచ్చి బొప్పాయి తరుగు – ముప్పావు కప్పు, ఉప్పు – తగినంత, వేయించిన పల్లీల పొడి – 2 టేబుల్ స్పూన్స్, దానిమ్మ గింజలు – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, నిమ్మరసం – ఒక టీ స్పూన్.
బొప్పాయి క్యాబేజి సలాడ్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత క్యాబేజి తురుము, పచ్చి బొప్పాయి తురుము వేసి కలపాలి. దీనిని 3 నుండి 4 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన తరువాత ఉప్పు, పల్లీల పొడి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దానిమ్మ గింజలు, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. దీనిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా బొప్పాయి, క్యాబేజితో సలాడ్ ను చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.