Paratha Sherwa : పరాటా షేర్వా.. మనకు హోటల్స్ లో, ధాబాలల్లో పరాటాలను ఈ షేర్వాతో సర్వ్ చేస్తూ ఉంటారు. ఈ షేర్వాతో తింటే పరాటాలు మరింత రుచిగా ఉంటాయి. కేవలం పరాటాలే కాకుండా రుమాలీ రోటీ, చపాతీ, నాన్, ప్లేన్ బిర్యానీ, బగారా అన్నంలోకి కూడా షేర్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే హోటల్ స్టైల్ పరాటా షేర్వాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పరాటా షేర్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు కొబ్బరి ముక్కలు – పావు కప్పు, జీడిపప్పు – 10 నుండి 15, గసగసాలు – ఒక టేబుల్ స్పూన్, సోంపు గింజలు – ఒక టీ స్పూన్, నూనె – 4 టేబుల్ స్పూన్స్, అనాస పువ్వు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 2, యాలక్కాయ – 1, మిరియాలు – 4, బిర్యానీ ఆకు – 1, ఎండుమిర్చి – 1, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన బంగాళాదుంప – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి -అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, టమాటాలు – పెద్దవి రెండు, నీళ్లు – 650 ఎమ్ ఎల్.
పరాటా షేర్వా తయారీ విధానం..
ముందుగా జార్ లో ఎండుకొబ్బరి ముక్కలు, సోంపు గింజలు, జీడిపప్పు, గసగసాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.తరువాత మసాలా దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత బంగాళాదుంప ముక్కలు వేసి వేయించాలి. ఈ ముక్కలు 30 శాతం వేగిన తరువాత కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. వీటిని కొద్దిగా వేయించిన తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి కలపాలి.
వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత టమాటాలను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత మంటను మధ్యస్థంగా చేసి నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పరాటా షేర్వా తయారవుతుంది. ఈ విధంగాతయారు చేసిన షేర్వాతో పరాటాలను తింటే చాలా రుచిగా ఉంటాయి.