Pepper Rasam : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన మిరియాల చారు త‌యారీ ఇలా.. అన్నంలో సూప‌ర్‌గా ఉంటుంది..!

Pepper Rasam : ఔష‌ధ గుణాలు క‌లిగిన దినుసుల్లో మిరియాలు కూడా ఒక‌టి. మిరియాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు మిరియాల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే చారును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మిరియాల‌తో చేసే ఈ చారు ఘాటు ఘాటుగా చాలా రుచిగా ఉంటుంది. జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఈ చారుతో అన్నం తింటే చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఈ మిరియాల చారును త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. రుచితో పాటు ఆరోగ్యాని అందించే ఈ మిరియాల చారును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మిరియాల చారు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మిరియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలక‌ర్ర – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 15, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 3, ఆవాలు – అర టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, త‌రిగిన ట‌మాట – పెద్ద‌ది ఒక‌టి, ఉప్పు – త‌గినంత‌, అర లీట‌ర్ నీటిలో నాన‌బెట్టిన చింత‌పండు – నిమ్మ‌కాయంత‌, క‌రివేపాకు – 4 రెమ్మ‌లు ( కాడ‌ల‌తో స‌హా), త‌రిగిన కొత్తిమీర – గుప్పెడు, ఇంగువ – పావు టీ స్పూన్.

Pepper Rasam recipe in telugu very tasty and healthy
Pepper Rasam

మిరియాల చారు త‌యారీ విధానం..

ముందుగా రోట్లో మిరియాలు, జీల‌క‌ర్ర‌, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి బ‌ర‌క‌గా దంచుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, ఎండుమిర్చి, ప‌సుపు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉప్పు వేసి క‌లిపి ట‌మాట ముక్క‌లు గుజ్జుగా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత చింత‌పండు ర‌సం, క‌రివేపాకు, కొత్తిమీర‌, ఇంగువ‌, దంచుకున్న మిరియాల మిశ్ర‌మం వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఈ ర‌సాన్ని ఒక పొంగు వ‌చ్చే వ‌ర‌కు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మిరియాల చారు త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడిగా అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. వాతావ‌రణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు ఇలా వేడివేడిగా మిరియాల చారుతో అన్నం తింటే ఎంతో హాయిగా ఉంటుంది.

D

Recent Posts