Perugu Annam Talimpu : పెరుగును మనం ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగులో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పెరుగుతో మనం దద్దోజనాన్ని కూడా తయారు చేస్తూ ఉంటాం. దద్దోజనం చాలా రుచిగా ఉంటుంది. ఆలయాల్లో ప్రసాదంగా ఎక్కువగా దద్దోజనాన్ని ఇస్తూ ఉంటారు. ఈ దద్దోజనాన్ని రుచిగా, చక్కగా ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దద్దోజనం తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – ఒక పెద్ద కప్పు, తియ్యటి పెరుగు – అర లీటర్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం తరగు – ఒక టీ స్పూన్, కచ్చాపచ్చగా దంచిన మిరియాలు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఇంగువ – కొద్దిగా.
దద్దోజనం తయారీ విధానం..
ముందుగా అన్నాన్ని గిన్నెలోకి తీసుకుని గంటెతో మెత్తగా చేసుకోవాలి. తరువాత అందులో ఉప్పు, పెరుగు వేసి కలుపుకోవాలి. తరువాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మిరియాలు, అల్లం తరుగు వేసి కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపు వేగిన తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో వేసి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరను వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దద్దోజనం తయారవుతుంది. దీనిని నేరుగా లేదా ఊరగాయతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మామూలు పెరుగన్నాన్ని తినడానికి ఇష్టపడని వారు ఇలా దద్దోజనంగా చేసుకుని తినవచ్చు. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేయడంతో పాటు ఇతర ఆరోగ్యప్రయోజనాలు కూడా కలుగుతాయి.