Perugu Chutney : పెరుగు చట్నీ.. పెరుగుతో చేసే ఈ చట్నీ చాలా రుచిగాఉంటుంది. సమయం తక్కువగా ఉన్నప్పుడు లేదా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా పెరుగుతో చట్నీని తయారు చేసి తీసుకోవచ్చు. అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఇంట్లో పెరుగు ఉంటే చాలు దీనిని 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. వంట రాని వారు కూడా ఈ పెరుగు చట్నీని చిటికెలో తయారు చేసుకోవచ్చు. పెరుగుతో కమ్మటి చట్నీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఇంగువ – చిటికెడు, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 6, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, పెరుగు – ఒక కప్పు, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీస్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్.
పెరుగు చట్నీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు చల్లారిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పెరుగు వేసి కలపాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి మంటను చిన్నగా చేసి కలుపుతూ ఉడికించాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. ఈ పెరుగు మిశ్రమాన్ని దగ్గర పడి నూనె పైకి తేలే వరకు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెరుగు చట్నీ తయారవుతుంది. దీనిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల 5 రోజుల పాటు తాజాగా ఉంటుంది. అన్నంతో పాటు చపాతీ, అల్పాహారాలతో కూడా ఈ చట్నీని తినవచ్చు.