సాధారణంగా పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు.ఎన్నో పోషక విలువలు కలిగిన పెసరపప్పును తినడం వల్ల శరీరం చలువ చేస్తుంది కనుక వేసవికాలంలో ఈ పెసరపప్పు పాయసం తినడం ఎంతో ఆరోగ్యకరం. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పెసరపప్పు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
పెసరపప్పు 2 కప్పులు, పాలు ఒక కప్పు, బెల్లం ఒకటిన్నర కప్పు, గసగసాలు రెండు స్పూన్లు, యాలకులు 5, డ్రై ఫ్రూట్స్ గుప్పెడు, నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బెర ముక్కలు అర కప్పు.
తయారీ విధానం
ముందుగా మిక్సీ గిన్నెలో యాలకులు, కొబ్బరి ముక్కలు, బాదం, గోడంబి, గసగసాలు మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టి ఉంచి అందులోకి కొద్దిగా నెయ్యి వేసి వేడి అయిన తర్వాత పెసర పప్పును వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు వేయించిన ఈ పెసరపప్పును కుక్కర్లో వేసి అరకప్పు పాలు కొన్ని నీళ్లు వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఇప్పుడు ఉడికిన ఈ పెసరపప్పును మరొక పాన్లో వేసి ఇదివరకే మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి చిన్న మంటపై ఉడికించాలి. ఈ విధంగా పెసరపప్పు మిశ్రమం ఉడుకుతున్నప్పుడు బెల్లం పొడి వేసి మిగిలిన పాలు వేసి చిన్న మంటపై బాగా కలియబెడుతూ ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల పాటు ఉడికించి తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసరపప్పు పాయసం రుచిని ఆస్వాదించవచ్చు.