Pindi Vadiyalu : పప్పు, సాంబార్ వంటి వాటితో వడియాలు, అప్పడాలు వంటి వాటిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అలాగే మనం రకరకాల వడియాలను ఇంట్లో తయారు చేస్తూ ఉంటాం. ఈ వడియాలను ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే బయట కొనుగోలు చేసే పని లేకుండా సంవత్సరమంతా వీటిని మనం వేయించుకుని తినవచ్చు. మనం ఇంట్లో సలుభంగా, రుచిగా తయారు చేసుకోదగిన వడియాల్లో పిండి వడియాలు ఒకటి. బియ్యం పిండితో చేసే ఈ వడియాలు వేయించుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. బియ్యం పిండితో వడియాలను ఎలా తయారు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పిండి వడియాల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – ఒక గ్లాస్, సగ్గు బియ్యం – పావు గ్లాస్, నీళ్లు – 9 గ్లాసులు, పచ్చిమిర్చి – 6 లేదా కారానికి తగినన్ని, ఉప్పు – తగినంత.
పిండి వడియాల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో సగ్గు బియ్యాన్ని తీసుకుని తగినన్ని నీళ్లు పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో బియ్యం పిండి తీసుకుని రెండు గ్లాసుల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు ఉంచాలి. అలాగే జార్ లో పచ్చిమిర్చి, ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఏడు గ్లాసులు నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిన తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమం వేసి కలపాలి. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న బియ్యం పిండిని కలుపుతూ మరుగుతున్న నీటిలో వేసుకోవాలి. దీనిని ఉండలు లేకుండా అడుగ భాగం మాడకుండా కలుపుతూ ఉండాలి. పిండిని 15 నుండి 20 నిమిషాల పాటు బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ పిండి కొద్దిగా చల్లారిన తరువాత కాటన్ వస్త్రం మీద గంటెతో పిండిని తీసుకుంటూ వడియాల లాగా పెట్టుకోవాలి. వీటిని రెండు రోజుల పాటు ఎండబెట్టిన తరువాత చీర నుండి వేరు చేసి మరో రెండు మూడు రోజులు బాగా ఎండబెట్టాలి. తరువాత వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజులు నిల్వ ఉంటాయి.ఇలా చేయడం వల్ల రుచిగా ఉండే పిండి వడియాలు తయారవుతాయి. ఈ వడియాలను నూనె బాగా కాగిన తరువాత నూనెలో వేసి వేయించుకుంటే చక్కగా పొంగుతాయి. ఇలా వేయించుకున్న వడియాలను పప్పు, సాంబార్, రసం వంటి వాటితో కలిపి తినవచ్చు. బయట మార్కెట్ లో కొనే పని లేకుండా ఇలా వడియాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.