Poha Cutlet : అటుకులు.. వీటితో మనం రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. అటుకులతో చేసే వంటకాలు రుచిగాఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. అటుకులతో చేసుకోదగిన రుచికరమైన స్నాక్స్ వెరైటీలలో పోహ కట్లెట్ కూడా ఒకటి. అటుకులతో చేసే ఈ కట్లెట్ చాలా రుచిగా ఉంటుంది. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా, కరకరలాడుతూ ఉండే ఈ పోహ కట్లెట్ లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పోహ కట్లెట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అటుకులు – ఒక కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు – 3, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్.
పోహ కట్లెట్ తయారీ విధానం..
ముందుగా అటుకులను నీటిలో వేసి శుభ్రంగాకడగాలి. తరువాత వాటిపై నీటిని చల్లి 5 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత అటుకులను చేత్తో కొద్దిగా నలపాలి. తరువాత ఇందులోనే బంగాళాదుంపలను తురిమి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నూనె, మైదాపిండి తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. అటుకుల మిశ్రమం పలుచగా ఉంటే కొద్దిగా కార్న్ ఫ్లోర్ ను కూడా వేసుకోవచ్చు. ఇలా ముద్దగా చేసిన తరువాత కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ కట్లెట్ ఆకారంలో వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత గిన్నెలో మైదాపిండి తీసుకుని అందులో నీళ్లు పోసి పలుచని మిశ్రమంలా కలుపుకోవాలి. అలాగే కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక ఒక్కో కట్లెట్ ను మైదాపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పోహ కట్లెట్ లు తయారవుతాయి. వీటిని మైదాపిండితో పాటు బ్రెడ్ క్రంబ్స్, కార్న్ ఫ్లేక్స్ తో కూడా కోటింగ్ చేసుకుని నూనెలో వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఈ కట్లెట్ లు మరింత క్రిస్పీగా తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో కలిపి తింటే మరింత రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.