Liver Inflammation : మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కాలేయం కూడా ఒకటి. మన శరీరంలో కాలేయం అనేక విధులను నిర్వర్తిస్తుంది. కాలేయ ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బతిన్నా కూడా మనం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వైద్యుని సలహా లేకుండా మందులు వాడడం, మద్యపానం, ఒత్తిడి వంటి వివిధ కారణాల కాలేయ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక మనం కాలేయాన్ని ఎల్లప్పుడు ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాలేయంలో మలినాలు, విష పదార్థాలు పేరుకుపోకుండా చూసుకోవాలి. అప్పుడే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. మన వంటింట్లో ఉండే కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించి మనం చాలా సులభంగా కాలేయాన్ని ఎల్లప్పుడు ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. వీటితో జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల కాలేయం పనితీరు కూడా మెరుగుపడుతుంది.
కాలేయంలోని మలినాలను, విష పదార్థాలను తొలగించి కాలేయాన్ని డిటాక్స్ చేసే ఆ పదార్థాలు ఏమిటి… ఈ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం సొరకాయను, కొత్తిమీరను, నిమ్మరసాన్ని, పసుపును ఉపయోగించాల్సి ఉంటుంది. సొరకాయను ఉపయోగించడం వల్ల కాలేయం శుభ్రపడడంతో పాటు వివిధ రకాల కాలేయ సమస్యలు కూడా తగ్గుతాయి. వీటిలో ఉండే పోషకాలు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే కొత్తిమీరను వాడడం వల్ల కూడా కాలేయం శుభ్రపడుతుంది. పసుపును వాడడం వల్ల కాలేయంలో ఉండే విష పదార్థాలు తొలగిపోతాయి. ఈ పదార్థాలన్నీ కూడా కాలేయాన్ని శుభ్రపరచడంలో ఎంతో సహాయపడతాయి.
వీటితో జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక జార్ లో ఒక కప్పు సొరకాయ ముక్కలను తీసుకోవాలి. తరువాత ఇందులో గుప్పెడు కొత్తిమీర, తగినన్ని నీళ్లు పోసి జ్యూస్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ జ్యూస్ ను ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో అర చెక్క నిమ్మరసం, తగినంత నల్ల ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల లివర్ డిటాక్స్ డ్రింక్ తయారవుతుంది. ఈ జ్యూస్ ను ఉదయం పరగడుపున తాగాలి. దీనిని తాగిన అరగంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ విధంగా జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల కాలేయంలోని మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. కాలేయం పనితీరు కూడా మెరుగుపడుతుందని కాలేయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.