Poha Cutlets : మనం అటుకులతో రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. అటుకులతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. అటుకులతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో అటుకుల కట్లెట్ కూడా ఒకటి. అటుకులతో చేసే కట్లెట్ చాలా రుచిగా ఉంటుంది. ఈ కట్లెట్ ను పాలకూర వేసి మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. స్నాక్స్ గా ఈ కట్లెట్ ను తినవచ్చు. 20 నిమిషాల్లోనే ఈకట్లెట్ ను తయారు చేసుకోవచ్చు. రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ అటుకుల కట్లెట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పోహ కట్లెట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 3 నుండి 4 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి – 2, వెల్లుల్లి రెబ్బలు – 6, అల్లం – ఒక చిన్న ముక్క, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, శనగపిండి – పావు కప్పు, చిన్నగా తరిగిన పాలకూర – ఒక కప్పు, రెడ్ చిల్లీ ప్లేక్స్ – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పోహ కట్లెట్ తయారీ విధానం..
ముందుగా అటుకులను శుభ్రంగా కడిగి వడకట్టి గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో పల్లీలు వేసి దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిపై ఉండే పొట్టు తీసేసి పక్కకు ఉంచాలి. తరువాత జార్ లో పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వేసి ముందుగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే వేయించిన పల్లీలు వేసి పలుకులుగా అయ్యే వరకు మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత నానబెట్టిన అటుకులు వేసి అవసరమైతే ఒక టేబుల్ స్పూన్ నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని అదే గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసి నీళ్లు పోయకుండా బాగా కలుపుకోవాలి.
తరువాత అటుకుల మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కట్లెట్ ల ఆకారంలో వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కట్లెట్ లను వేసి వేయించాలి. వీటిని అటూ ఇటూ తిప్పుతూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పోహ కట్లెట్ లు తయారవుతాయి. వీటిని వేడి వేడిగా టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ కట్లెట్ లను తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.