Potato Fingers : బంగాళాదుంపలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో కూరలనే కాకుండా రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపను ఉపయోగించి చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా రుచిగా, పిల్లలు కూడా చేసేంత సులభంగా బంగాళాదుంపలతో పొటాటొ ఫింగర్స్ ను ఎలా తయారు చేసుకోవాలో.. అలాగే వీటిని తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పొటాటొ ఫింగర్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 2, బొంబాయి రవ్వ – 100 గ్రా., తరిగిన కొత్తిమీర – అర కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు – తగినంత, నీళ్లు – 100 ఎమ్ ఎల్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పొటాటొ ఫింగర్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక రవ్వను వేసి ఉడికించాలి. రవ్వ ఉడికి దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఉడికించిన బంగాళాదుంపల పొట్టును తీసి తురుముకోవాలి. ఇందులోనే ఉడికించిన రవ్వను కూడా వేయాలి. తరువాత ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. తరువాత చేతులకు నూనె రాసుకుంటూ తగినంత బంగాళాదుంప మిశ్రమాన్ని తీసుకుని ఫింగర్ప్ ఆకారంలో సన్నగా, పొడుగ్గా చుట్టుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో తగినంత నూనె పోసి వేడి చేయాలి.
నూనె కాగిన తరువాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఫింగర్స్ ను నూనెకు సరిపడా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై కదుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత వీటిని టిష్యూ పేపర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పొటాటొ ఫింగర్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా ఈ పొటాటొ ఫింగర్స్ ను తయారు చేసుకుని తినవచ్చు. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.