Potato Lollipops : ఆలుతో ఎంతో రుచిక‌ర‌మైన లాలిపాప్స్‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Potato Lollipops : బంగాళాదుంప‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే చిరుతిళ్ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. బంగాళాదుంప‌ల‌తో సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన చిరుతిళ్ల‌ల్లో పొటాటో లాలిపాప్స్ ఒక‌టి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌య‌ట క‌ర‌క‌ర‌లాడుతూ లోప‌ల మెత్త‌గా ఉండే ఈ లాలిపాప్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పొటాటో లాలిపాప్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ్రెడ్ స్లైసెస్ – 2, మెత్త‌గా ఉడికించిన బంగాళాదుంప‌లు – 2 ( పెద్ద‌వి), చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, అల్లం త‌రుగు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, చాట్ మ‌సాలా – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Potato Lollipops recipe in telugu very tasty easy to make them
Potato Lollipops

పొటాటొ లాలిపాప్స్ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో బ్రెడ్ స్లైసెస్ ను వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. ఇందులో త‌గిన‌న్ని నీళ్లు పోస్తూ ఉండ‌లు లేకుండా ప‌లుచ‌గా క‌లుపుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో బంగాళాదుంప‌ల‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి. ఇందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నింటిని వేసుకోవాలి. ఇందులో మిక్సీ ప‌ట్టుకున్న బ్రెడ్ నుండి స‌గం పొడిని వేసుకోవాలి. మిగిలిన బ్రెడ్ పొడిని ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు అన్నీ క‌లిసేలా బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ బంగాళాదుంప మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ లాలిపాప్స్ లా గుండ్రంగా చేసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత ఒక్కో లాలిపాప్ ను మైదాపిండి మిశ్ర‌మంలో ముంచాలి.

త‌రువాత వాటిని బ్రెడ్ క్రంబ్స్ లో వేసి రోల్ చేసుకోవాలి. లాలిపాప్స్ కు బ్రెడ్ క్రంబ్స్ చ‌క్క‌గా ప‌ట్టిన త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక లాలిపాప్స్ ను వేసి వేయించుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ లాలిపాప్స్ త‌యార‌వుతాయి. వీటిని ట‌మాట కిచ‌ప్ తో, మ‌యోనీస్, పుదీనా చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. పిల్ల‌లు వీటిని మ‌రింత ఇష్టంగా తింటారు. ఈ ఆలూ లాలిపాప్స్ సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి చ‌క్క‌గా ఉంటాయి.

Share
D

Recent Posts