Potato Mixture : మనకు స్వీట్ షాపుల్లో లభించే వివిధ రకాల మిక్చర్లలో పొటాటో మిక్చర్ కూడా ఒకటి. మనకు షాపుల్లో ప్యాకెట్ ల రూపంలో కూడా ఇది లభిస్తుంది. బంగాళాదుంపలతో చేసే మిక్చర్ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ పొటాటో మిక్చర్ ను చాలా సులభంగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కేవలం అరగంట వ్యవధిలోనే ఈ పొటాటో మిక్చర్ ను మనం తయారు చేసుకోవచ్చు. రుచిగా, కరకరలాడుతూ ఉండే ఈ పొటాటో మిక్చర్ ను మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పొటాటో మిక్చర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – అరకిలో, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కరివేపాకు – రెండు రెమ్మలు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పొటాటో మిక్చర్ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలపై చెక్కును తీసి వాటిని గ్రేటర్ తో సన్నగా తరుముకోవాలి. తరువాత ఈ బంగాళాదుంప తురుమును శుభ్రంగ కడిగి నీరంతా పోయే వరకు పూర్తిగా వడకట్టుకోవాలి. తరువాత ఈ తురుమును కాటన్ వస్త్రంపై వేసి ఆరబెట్టుకోవాలి. దీనిని పావు గంట పాటు ఆరబెట్టుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప తురుమును వేసి వేయించాలి. దీనిని మధ్యస్థ మంటపై కలుపుతూ ఎర్రగా కరకరలాడే వరకు వేయించుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు ఒక్కొక్కటిగా వేసి వేయించి వీటిని కూడా గిన్నెలో వేసుకోవాలి. తరువాత వాటిపై ఉప్పు, కారం వేసి టాస్ చేస్తూ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పొటాటో మిక్చర్ తయారవుతుంది. దీనిని సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.