Pudina Semiya : సేమియాతో మనం ఎక్కువగా సేమ్యా ఉప్మాను తయారు చేస్తూ ఉంటాము. అల్పాహారంగా, స్నాక్స్ గా దీనిని తీసుకుంటూ ఉంటాము. సేమ్యా ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ సేమియా ఉప్మాను మరింత రుచిగా వెరైటీగా కూడా తయారు చేసుకోవచ్చు. పుదీనా వేసి చేసే ఈ సేమ్యా చాలా రుచిగా ఉంటుంది. వెరైటీ రుచులు కోరుకునే వారు దీనిని తయారు చేసి తీసుకోవచ్చు. ఈ పుదీనా సేమియాను తయారు చేయడం కూడా చాలా సులభం. మరింత రుచిగా, అందరికి నచ్చేలా పుదీనా సేమియాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా సేమియా తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – ఒక లీటర్, సేమియా – ఒక కప్పు, నూనె – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు – 4, జీలకర్ర – ఒక టీ స్పూన్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ – 1, పుదీనా ఆకులు – ఒక పెద్ద కట్ట, కొత్తిమీర – పావు కట్ట, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
పుదీనా సేమియా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత సేమియా వేసి 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని వడకట్టి వాటిపై చల్లటి నీటిని పోసి పూర్తిగా ఆరబెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత అల్లం తరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పుదీనా, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటన్నింటిని జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి.
తరువాత కళాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత పల్లీలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మినపప్పు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ వేసి వేయించాలి. తరువాత ఉప్పు వేసి కలపాలి. దీనిని బాగా వేయించిన తరువాత సేమియా వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత వేయించిన పల్లీలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పుదీనా సేమియా తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా చాలా సులభంగా వెరైటీగా పుదీనా సేమియాను తయారు చేసి తీసుకోవచ్చు.