Pumpkin Halwa : మనం గుమ్మడికాయను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. గుమ్మడికాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. గుమ్మడికాయలతో కూర,పులుసు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. ఇవి మనం ఎప్పుడూ చేసే వంటకాలే. ఇవి మాత్రమే కాకుండా గుమ్మడికాయతో మనం ఎంతో రుచిగా ఉండే హల్వాను కూడా తయారు చేసుకోవచ్చు. గుమ్మడికాయ హల్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ గుమ్మడికాయ హల్వాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుమ్మడి హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
గుమ్మడికాయ ముక్కలు – 200గ్రా., పాలు – ఒక కప్పు, పంచదార – అర కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – కొద్దిగా.
గుమ్మడి హల్వా తయారీ విధానం..
ముందుగా గుమ్మడికాయ ముక్కలను మెత్తగా ఉడికించాలి. తరువాత ఈ ముక్కలను మెత్తగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నెయ్యిలో మెత్తగా చేసుకున్న గుమ్మడి మిశ్రమం వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పాలు పోసి కలపాలి. దీనిని కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత పంచదార వేసి కలపాలి. తరువాత దీనిని హల్వాలాగా దగ్గరయ్యే వరకు ఉడికించాలి. తరువాత యాలకుల పొడి, జీడిపప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గుమ్మడి హల్వా తయారవుతుంది. దీనిని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా గుమ్మడికాయతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా హల్వాను కూడా తయారు చేసుకుని తినవచ్చు.