Sweet Shop Style Palli Patti : మన ఆరోగ్యానికి మేలు చేసే తీపి పదార్థాల్లో పల్లి పట్టి కూడా ఒకటి. పల్లి పట్టి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పల్లి పట్టిని తినడం వల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మనకు స్వీట్ షాపుల్లో కూడా ఈ పల్లి పట్టీలు లభిస్తాయి. స్వీట్ షాపుల్లో లభించే పల్లి పట్టీలు రుచిగా ఉండడంతో పాటు తినడానికి కూడా చాలా సులభంగా ఉంటాయి. అచ్చం స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఎంతో చక్కగా ఉండే ఈ పల్లి పట్టీలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పల్లీలు, బెల్లం ఉంటే చాలు ఈ పల్లి పట్టిని 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. స్వీట్ షాప్ స్టైల్ పల్లి పట్టీలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లి పట్టి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక కప్పు, బెల్లం తురుము -ఒక కప్పు, నెయ్యి – ఒక టీ స్పూన్, నీళ్లు – 20 ఎమ్ ఎల్, యాలకుల పొడి – కొద్దిగా.
పల్లి పట్టి తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. తరువాత వీటిపై ఉండే పొట్టును తీసి వేయాలి. ఈ పల్లీలను రెండు ముక్కలుగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగి ముదురు పాకం వచ్చే వరకు ఉడికించాలి. బెల్లం మిశ్రమాన్ని నీటిలో వేసి చేస్తూ అది ముద్దగా గట్టి ఉండలాగా ఉండాలి. ఇలా బెల్లం ముదురుపాకం రాగానే ఇందులో వేయించిన పల్లీలు వేసి కలపాలి. తరువాత యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక ప్లేట్ లో బటర్ పేపర్ ను తీసుకుని దానికి నెయ్యి రాయాలి. తరువాత పల్లి మిశ్రమాన్ని ఈ బటర్ పేపర్ పై వేసి పలుచగా సమానంగా వత్తుకోవాలి.
దీనిని రెండు నిమిషాల పాటు చల్లారిన తరువాత మనకు కావల్సిన ఆకారంలో గాట్లు పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత దీనిని బటర్ పేపర్ నుండి వేరుచేసుకుని ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పల్లి పట్టి తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది. ఇలా చాలా సులభంగా, రుచిగా ఇంట్లోనే పల్లి పట్టిని తయారు చేసుకుని తినవచ్చు. పిల్లలకు దీనిని ఇవ్వడం వల్ల రుచితో పాటు పోషకాలను అందించవచ్చు.