Aishwarya Deepam : మనలో చాలా మంది ఎంత కష్టపడినప్పటికీ డబ్బులు సంపాదించలేకపోతుంటారు. చేసే వ్యాపారం అభివృద్ది చెందక, అందులో లాభాలు రాక, సంపాదించిన ధనం నిలవక, అప్పులు తీరక, అరకొర జీతాలతో సతమతమై పోయే వారు ప్రస్తుత కాలంలో చాలా మందే ఉన్నారు. మనం ఎంత కష్టపడినప్పటికీ మన దగ్గర ధనం నిలబడకపోవడానికి కారణం మనపై ఆ మహా లక్ష్మీ దేవి అనుగ్రహం లేకపోవడమేనని పండితులు చెబుతున్నారు. శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొంది మన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలంటే మనం ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలని వారు చెబుతున్నారు.
ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతామని అంతేకాకుండా సకల సంపదలు కూడా చేకూరుతాయని అంటున్నారు. ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, వృథా ఖర్చులు తగ్గుతాయని, సంపద చేతిలో నిలుస్తుందని, వ్యాపారం అభివృద్ధి చెందడంతోపాటు వ్యాపారంలో లాభాలు కూడా వస్తాయని పండితులు తెలియజేస్తున్నారు. సకల సంపదలను ఇచ్చే ఈ ఐశ్వర్య దీపాన్ని ఎప్పుడు, ఎలా, ఎన్ని రోజుల పాటు వెలిగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందు, సూర్యోదయానికి తర్వాత వెలిగించాలి. శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంటి పరిసరాలను, ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. తరువాత లక్ష్మీ దేవి ఫోటోను కానీ, ప్రతిమను కానీ శుభ్రం చేసి చందనం, పసుపును కలిపి బొట్లు పెట్టాలి. పువ్వలతో ప్రతిమను కానీ, పటాన్ని కానీ అలంకరించుకోవాలి. బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి. తరువాత ఒక ఇత్తడి ప్లేట్ ను తీసుకుని అందులో ఒక పెద్ద ప్రమిదను ఉంచి ఆ ప్రమిదను రాళ్ల ఉప్పుతో నింపాలి. ఆ పెద్ద ప్రమిదపై కలకండ, అక్షింతలు నింపిన మరో ప్రమిదను ఉంచాలి.
ఇలా అక్షింతలు, కలకండ ఉంచిన దీపంపై నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించాలి. ఈ ప్రమిదల చుట్టూ పువ్వులతో అలంకరించుకోవాలి. లక్ష్మీ దేవికి బెల్లంతో చేసిన పదార్థాలను కానీ, చిన్న బెల్లం ముక్కను కానీ నైవేద్యంగా ఉంచాలి. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు తాంబూలం తప్పక ఉండాలి. ఆ తరువాత దీపారాధన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఐశ్వర్య దీపాన్ని వెలిగించినట్టు అవుతుంది.
ఈ దీపాన్ని శుక్రవారం రోజు ఉదయం, సాయంత్రం వెలిగించాలి. శనివారం రోజు లేదా ఆదివారం రోజు దీపాన్ని వెలిగించడానికి ఉంచిన ఉప్పును ప్రవహించే నీటిలో వేయాలి. ఇలా ప్రతి శుక్రవారం చేసిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు కనకధార స్త్రోత్తాన్ని పఠించడం వల్ల అధిక మేలు కలుగుతుంది. ఇలా 9, 11, 21 వారాల పాటు వెలిగించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా శాశ్వతంగా ధన ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.