Ragi Dibba Rotte : రాగులను పిండిగా చేసి రకరకాల వంటకాలను ఎలా తయారు చేస్తామో రాగులను రవ్వగా చేసి కూడా అనేక రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. రాగి రవ్వతో చేసుకోదగిన రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటకాల్లో రాగి దిబ్బరొట్టె కూడా ఒకటి. రాగి దిబ్బరొట్టె చాలా రుచిగా ఉంటుంది. అలాగే మెత్తగా, మృదువుగా ఉంటుంది. ఈ దిబ్బరొట్టెలను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. తరుచూ ఒకేరకం దిబ్బరొట్టెలు కాకుండా ఇలా వెరైటీగా ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా తయారు చేసుకుని తినవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని కోరుకునే వారికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. రాగులతో దిబ్బరొట్టెలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి దిబ్బరొట్టె తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక గ్లాస్, రాగి రవ్వ – 3 గ్లాసులు, ఉప్పు – తగినంత.
రాగి దిబ్బరొట్టె తయారీ విధానం..
ముందుగా మినపప్పును శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఈ మినపప్పును జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత రాగి రవ్వను శుభ్రంగా కడిగి నీటిని పిండేస్తూ మిక్సీ పట్టుకున్న పిండిలో వేసి కలపాలి.తరువాత దీనిపై మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి. పిండి చక్కగా పులిసిన తరువాత ఇందులో ఉప్పు వేసి కలపాలి. తరువాత స్టవ్ మీద మందంగా ఉండే కళాయిని ఉంచి నూనె వేసుకోవాలి. తరువాత పిండి వేసి పైన మరలా నూనె వేసుకుని మూత పెట్టాలి. దీనిని చిన్న మంటపై 7 నుండి 8 నిమిషాల పాటు కాల్చుకున్న తరువాత నెమ్మదిగా కళాయి నుండి వేరు చేసి పెనం మీద వేసుకోవాలి. తరువాత మరికొద్దిగా నూనె వేసి చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి దిబ్బ రొట్టె తయారవుతుంది. దీనిని చట్నీ, సాంబార్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా రాగి రవ్వతో దిబ్బరొట్టెను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.