Ragi Dosa Recipe : రాగిపిండితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. రాగిపిండితో చేసే వంటకాలను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఇలా రాగిపిండితో చేసుకోదగిన వంటకాల్లో రాగి దోశ కూడా ఒకటి. అల్పాహారంగా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. రాగిదోశను తయారు చేయడం చాలా సులభం. రాగిపిండి ఉంటే చాలు ఇన్ స్టాంట్ గా అప్పటికప్పుడు ఈ దోశను తయారు చేసుకోవచ్చు. రాగిపిండితో ఇన్ స్టాంట్ గా, రుచిగా దోశను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ రాగి దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగిపిండి – ఒక కప్పు, రవ్వ – పావు కప్పు, బియ్యంపిండి – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పెరుగు – పావు కప్పు.
ఇన్ స్టాంట్ రాగి దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రాగిపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో రవ్వ, బియ్యంపిండి, ఉప్పు వేసి కలపాలి. తరువాత పెరుగు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిని దోశ పిండి మాదిరి కలుపుకున్న తరువాత మూత పెట్టి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. పిండి చక్కగా నానిన తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం కొద్దిగా వేడయ్యాక నూనె వేసి తుడుచుకోవాలి. దోశ వేసేటప్పుడు పెనం కొద్దిగా వేడిగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే దోశ సరిగ్గా రాదు. ఇప్పుడు పిండిని తీసుకుని దోశ లాగా వేసుకోవాలి. ఈ దోశ మరీ పలుచగా రాదు. దోశ తడి ఆరిన తరువాత నూనె వేసి కాల్చుకోవాలి. దోశను రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి దోశ తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా రాగి పిండితో దోశలను తయారు చేసి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.