Cooking Oil Reuse : వంట నూనె.. ఇది లేని వంటగది ఉండదనే చెప్పవచ్చు. మనం చేసే ప్రతివంటలోనైనూ వంటనూనెను ఉపయోగిస్తూ ఉంటాము. కూరలకు రుచిని తీసుకురావడంలో, అలాగే కూరలు గ్రేవీ ఎక్కువగా ఉండేలా చేయడంలో వంట నూనె మనకు సహాయపడుతుంది. అలాగే అనేక రకాల వంటకాలను నూనెలో డీప్ ఫ్రై చేసి తీసుకుంటూ ఉంటాము. అయితే మనలో చాలా మంది ఇలా డీప్ ఫ్రైలకు వాడిన నూనెను మరలా వాడుతూ ఉంటారు. మరలా అదే నూనెలో డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. నూనెలో వేయించిన ఆహారాలు రుచిగా ఉన్నప్పటికి ఇలా అదే నూనెను మరలా వాడడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నూనె ఖర్చుతో కూడుకున్నది.కనుక దీనిని వృధా చేయలేక, పారబోయలేక మరలా వినియోగిస్తూ ఉంటారు. ఇలా నూనెను ఎక్కువగా సార్లు వేడి చేయడం వల్ల నూనెలో ఫ్రీరాడికల్స్ తయారవుతాయి.
ఈ ఫ్రీరాడికల్స్ మన శరీరానికి ఎంతో హానిని కలిగిస్తాయి. ఇవి కణాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. క్రమంగా కణాలను క్యాన్సర్ కణాలుగా మారుస్తాయి. అంతేకాకుండా ఫ్రీరాడికల్స్ కారణంగా శరీరంలో ఇన్ ప్లామేషన్ పెరుగుతుంది. అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అంతేకాకుండా వాడిన నూనెను మరలా వాడడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడతాయి. వాడిన నూనెను మరలా మరలా వాడడం వల్ల ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వాడిన నూనెను పారబోయడం ఇష్టంలేని వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మరలా ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాడిన నూనె వడకట్టిన తరువాతే మరలా ఉపయోగించాలి.
అలాగే ఒక్కసారి డీప్ ఫ్రైకు వాడిన నూనెను మరలా డీప్ ఫ్రైకు ఉపయోగించకూడదు. దీనిని కూరల తయారీలో మాత్రమే ఉపయోగించాలి. అలాగే నూనె జిడ్డుగా ఉన్నా, రంగు మారిన కూడా ఉపయోగించకూడదు. అలాగే వాడిన నూనెను మరలా వేడి చేసినప్పుడు ఎక్కువగా పొగ వస్తే కూడా మరలా ఉపయోగించకూడదు. ఒక్కసారి వాడిన నూనెను గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. అలాగే కొన్ని రకాల నూనెలు తక్కువ స్మోకింగ్ పాయింట్ ఉంటాయి. ఈ నూనెను డీప్ ఫ్రైలకు వాడడం మంచిది. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కసారి ఉపయోగించిన నూనెను మరలా వాడుకోవచ్చని అయితే ఒక్కసారి వాడిన నూనెను మరలా ఉపయోగించకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.