Rail Palaram : రైల్ పలారం.. బియ్యం పిండితో చేసే ఈ తెలంగాణా వంటకం చాలా రుచిగా ఉంటుంది. పూర్వం దీనిని రైళ్లల్లో ప్రయాణాలు చేసేటప్పుడు ఆహారంగా తీసుకోవడానికి తయారు చేసేవారు. అందుకే దీనిని రైల్ పలారం, రైల్ ఫలాహారం అని పేరు వచ్చింది. ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో కమ్మగా, రుచిగా ఉండే ఈ రైల్ పలారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రైల్ పలారం తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – ఒక కప్పు, నూనె – ఒక టీ స్పూన్, ఉప్పు – అర టీ స్పూన్, బియ్యంపిండి – ఒక కప్పు, అరగంట పాటు నానబెట్టిన శనగపప్పు – 3 టేబుల్ స్పూన్స్, అరగంటపాటు నానబెట్టిన పెసరపప్పు – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, జీడిపప్పు – కొద్దిగా, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – ఒక రెమ్మ, పచ్చిమిర్చి- 3, అల్లం – అర ఇంచు ముక్క, పసుపు – పావు టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు, నిమ్మరసం – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రైల్ పలారం తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నీళ్లు, నూనె, ఉప్పు వేసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం పిండి వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చల్లారనివ్వాలి. బియ్యం పిండి చల్లారిన తరువాత అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత చేతులకు నూనె రాసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత వీటిపై కొద్దిగా నూనె వేసి ఒక దానికి ఒకటి అత్తుకోకుండా కలుపుకోవాలి. తరువాత ఒక చిల్లుల గిన్నెలో అరటి ఆకు వేసి దానిపై ఈ ఉండలను వేసి ఆవిరి మీద 15 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఒక జార్ లో శనగపప్పు, పెసరపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత అల్లాన్ని, పచ్చిమిర్చిని రోట్లో వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, జీడిపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి మిశ్రమం, మిక్సీ పట్టుకున్న పెసరపప్పు మిశ్రమం వేసి వేయించాలి. ఇవి చక్కగా వేగిన తరువాత పచ్చి కొబ్బరి తురుము, పసుపు, ఉప్పు వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత ఉడికించిన బియ్యం ఉండలు వేసి కలపాలి. తరువాత నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుని మరో రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రైల్ పలారం తయారవుతుంది. దీనిని అల్పాహారంగా లేదా స్పాక్స్ గా తీసుకోవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.