Rajma Tikki : రాజ్మా గురించి తెలుగు రాష్ట్రాల్లో ఉండే చాలా మందికి తెలియదు. కానీ ఇవి చాలా బలవర్ధకమైన ఆహారం. చూసేందుకు పెద్ద సైజు చిక్కుడు గింజల్లా ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని ఉత్తరాది వారు ఎక్కువగా తింటుంటారు. చపాతీల్లోకి గాను కూరగా చేసి వీటిని తింటారు. అయితే వీటితో టిక్కీలను కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని సాయంత్రం సమయాల్లో స్నాక్స్‌గా తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరం కూడా. వీటి ద్వారా మనకు అనేక పోషకాలు లభిస్తాయి. ఇక రాజ్మా టిక్కీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాజ్మా టిక్కీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన రాజ్మా – ఒక కప్పు, ఉడికించిన బంగాళాదుంప – చిన్నది, కార్న్ ఫ్లోర్ – 2 టీస్పూన్లు, పచ్చి మిర్చి తరుగు – ఒక టేబుల్ స్పూన్, చాట్ మసాలా – అర టీస్పూన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ – ఒక టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – తగినంత.
రాజ్మా టిక్కీని తయారు చేసే విధానం..
ఉడికించిన రాజ్మా, బంగాళాదుంపలను మెదిపి ముద్దగా చేసి రెండూ కలపాలి. ఈ మిశ్రమానికి పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, చాట్ మసాలా, కార్న్ ఫ్లోర్ కలిపి చిన్న చిన్న టిక్కీలుగా చేయాలి. పెనంలో కొద్దిగా నూనె వేసి టిక్కీలు ఒకదాని పక్కన ఒకటి ఉంచి రెండు వైపులా కాల్చాలి. వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే టమాటా సాస్ లేదా స్వీట్ చట్నీతో తింటే చాలా బాగుంటాయి. టిక్కీలను పెనంపై కాల్చకుండా డీప్ ఫ్రై కూడా చేయవచ్చు. లేదా ఓవన్‌లో అయినా సరే బేక్ చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు.