Ravva Bonda : 15 నిమిషాల్లో సాయంత్రం స్నాక్స్‌.. వీటిని ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Ravva Bonda : మ‌నం బొంబాయి ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చాలా మంది దీనితో ఉప్మా, ర‌వ్వ ల‌డ్డూలు త‌ప్ప ఏ ఇత‌ర ప‌దార్థాల‌ను త‌యారు చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు. కానీ రవ్వ‌తో మ‌నం అనేక ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ర‌వ్వ బోండాలు కూడా ఒక‌టి. ఈ బోండాలు క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ర‌వ్వ‌తో చాలాత‌క్కువ స‌మ‌యంలో రుచిక‌ర‌మైన బోండాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ర‌వ్వ బోండా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బొంబాయి ర‌వ్వ – ఒక క‌ప్పు, గోధుమ‌పిండి – పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం త‌రుగు – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, పెరుగు – అర క‌ప్పు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, వంట‌సోడా – పావు టీ స్పూన్.

Ravva Bonda recipe in telugu make in this way
Ravva Bonda

ర‌వ్వ బోండాల త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో ర‌వ్వ‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో గోధుమ‌పిండి వేసి క‌ల‌పాలి. త‌రువాత నూనె, వంట‌సోడా త‌ప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ బోండా పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు నాన‌బెట్టుకోవాలి. ఇలా నాన‌బెట్టుకున్న త‌రువాత పిండి మ‌రీ గ‌ట్టిగా ఉంటే మ‌రి కొద్దిగా నీటిని పోసి క‌ల‌పాలి. త‌రువాత వంట‌సోడా వేసి క‌లపాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక పిండిని తీసుకుని బోండాలుగా వేసుకోవాలి. ఈ బోండాల‌ను మ‌ధ్య‌స్థ మ‌టంపై తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ర‌వ్వ బోండాలు త‌యార‌వుతాయి. ఇందులో గోధుమ‌పిండికి బ‌దులుగా మైదాపిండి కూడా వేసుకోవ‌చ్చు. ట‌మాట కిచ‌ప్ తో లేదా చ‌ట్నీతో తింటే ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి.

Share
D

Recent Posts