Raw Mango Pappu Charu : పచ్చి మామిడికాయను నురుగా తినడంతో పాటు వీటితో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. చింతపండుకు బదులుగా మామిడికాయను వాడి కొన్ని రకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇలా మామిడికాయతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మామిడికాయ పప్పచారు కూడా ఒకటి. మామిడికాయ వేసి చేసే ఈ పప్పు చారు చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పుచారుతో తింటే సంతృప్తిగా భోజనం చేస్తారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ పప్పుచారును తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా, కమ్మగా ఉండే ఈ మామిడికాయ పప్పుచారును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి మామిడికాయ పప్పుచారు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – పావు కప్పు, నీళ్లు – ఒక కప్పు, చిన్న మామిడికాయ – 1, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు -తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, పెద్ద ముక్కలుగా తరిగిన టమాట – 1, ఇంగువ – రెండు చిటికెలు, కారం – అర టీ స్పూన్, సాంబార్ పొడి – రెండు టీ స్పూన్స్, బెల్లం తరుము -ఒకటిన్నర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పచ్చి మామిడికాయ పప్పుచారు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ కండిపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత మామిడికాయపై ఉండే చెక్కును తీసేసి దానిని కూడా కుక్కర్ లో వేసుకోవాలి. తరువాత నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టాలి. మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పును మెత్తగా ఉడికించాలి. తరువాత మూత తీసి మామిడికాయను మెత్తగా చేసుకుని పిక్కను తీసేయాలి. తరువాత పప్పును కూడా మెత్తగా చేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత ముప్పావు లీటర్ వరకు నీళ్లు పోసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు టమాట ముక్కలు వేసి కలపాలి.
ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించిన తరువాత ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ తాళింపును చారులో వేసి కలపాలి. ఇందులోనే కారం, సాంబార్ పొడి వేసి కలపాలి. తరువాత ఈ కుక్కర్ ను స్టవ్ మీద ఉంచి చారును 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తరువాత కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పప్పుచారు తయారవుతుంది. ఈ పప్పు చారును అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మామిడికాయ వేసి చేసిన పప్పుచారును అందరూ లొట్టలేసుకుంటూ తింటారు.