Folate Deficiency Symptoms : నేటి తరుణంలో మనలో చాలా మంది నీరసం, బలహీనత, అలసట వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే నిద్రలేమి, ఐరన్ లోపించడం, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనే చెప్పవచ్చు. చాలా మంది వీటికి కారణాలు తెలియక సతమతమైపోతూ ఉంటారు. ఇలా నీరసం, బలహీనత బారిన పడడానికి ప్రధాన కారణం ఫోలేట్ లోపమని నిపుణులు చెబుతున్నారు. ఫోలేట్ నే విటమిన్ బి9 అని కూడా అంటారు. శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడంలో ఫోలేట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కూడా ఇతది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉండడం వల్ల శరీరంలో అవయవాలకు ఆక్సిజన్ సక్రమంగా సరఫరా అవ్వదు.
దీంతో రోజంతా ఉత్సాహంగా పనిచేయడానికి కావల్సినంత శక్తి లభించదు. అదే విధంగా కార్బోహైడ్రేట్స్ ను విచ్ఛినం చేసి శక్తిని ఉత్పత్తి చేయడంలో ఫోలేట్ దోహదపడుతుంది. శరీరంలో ఫోలేట్ లోపించడం వల్ల తల తిరిగినట్టుగా ఉండడం, నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల రావడం, చర్మం పాలిపోయినట్టుగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యను అధిగమించాలంటే మనం ఎక్కువగా ఫోలేట్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. మనం ప్రతిరోజూ 400 మైక్రో గ్రాముల ఫోలేట్ ను తీసుకోవాలని అదే గర్భిణీ స్త్రీలైతే 600 నుండి 800 మైక్రో గ్రాముల ఫోలేట్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫోలేట్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనం ఈ సమస్యను చాలా సులభంగా అధిగమించవచ్చు.
ఫోలేట్ ఎక్కువగా ఉండే ఆహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆకు పచ్చ కూరగాయల్లో, నిమ్మజాతికి చెందిన పండ్లల్లో, బీన్స్, అవకాడో, పాలకూర, ఆస్పరాగస్, బ్రస్సెల్స్ మొలకలు, అలసందలు, ఆవాలు, లివర్ వంటి వాటిలో కూడా ఫోలేట్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత ఫోలేట్ లభిస్తుంది. నీరసం, బలహీనత, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడే వారు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.