Red Chilli Chicken Fried Rice : ఈమధ్య కాలంలో మనకు ఎక్కడ చూసినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెరిగిపోయాయి. వీధికో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వెలుస్తోంది. దీంతో మనకు చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ వంటకాలు కూతవేటు దూరంలోనే అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఫాస్ట్ ఫుడ్ మాత్రమే కాదు.. ఏ ఆహారాలను అయినా సరే బయట తింటే.. అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కనుక వాటిని ఇంట్లోనే చేసుకోవాలి. ఇక బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లభించే చికెన్ ఫ్రైడ్ రైస్‌ను ఇంట్లోనే ఎంతో సులభంగా చేసుకోవచ్చు. ఇది కారంగా భలే రుచిగా ఉంటుంది. దీన్ని రుచి చూశారంటే ఇక బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వైపు వెళ్లరు. ఈ క్రమంలోనే చికెన్ ఫ్రైడ్ రైస్‌ను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్‌లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్ చిల్లి చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, బియ్యం – రెండు కప్పులు, ఎండు మిరపకాయలు – నాలుగు, కారం – ఒక టేబుల్ స్పూన్, టమాటా – ఒకటి (సన్నగా తరిగి పెట్టుకోవాలి), ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరగాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – చిటికెడు, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, మసాలాలు – ఒక టేబుల్ స్పూన్ (దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, యాలకులు), నీళ్లు – రెండు కప్పులు, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – తగినంత.
రెడ్ చిల్లి చికెన్ ఫ్రైడ్ రైస్ ను తయారు చేసే విధానం..
ప్రెషర్ కుక్కర్‌లో కొద్దిగా నూనె వేసి ఎండు మిరపకాయలు, మసాలాలు వేసి కొద్ది సేపు వేయించుకోవాలి. అనంతరం ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి మరికొద్ది సేపు వేయించుకుని వీటికి టమాటాలను జత చేయాలి. టమాటాలు ఉడుకుతున్న సమయంలో ఉప్పు, కారం వేసి బాగా ఉడకనిచ్చి అనంతరం చికెన్ ముక్కలు వేసి ఒకటి రెండు నిమిషాల పాటు వేయించి బియ్యం, రెండు కప్పుల నీళ్లను పోసి మూత పెట్టి నాలుగైదు విజిల్స్ రానివ్వాలి. వడ్డించే ముందు కొత్తిమీర చల్లుకోవాలి. దీంతో రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.