Rice Fingers : మనం బియ్యంతో రకరకాల చిరుతిళ్లను, పిండి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసే ఈ చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. బియ్యంపిండితో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో రైస్ ఫింగర్స్ కూడా ఒకటి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అలాగే ఇవి నెలరోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. ఈ ఫింగర్స్ ను తయారు చేసుకోవడం చాలా సులభం. బియ్యంపిండితో రుచిగా, కరకలాడుతూ, నిల్వ ఉండే ఈ రైస్ ఫింగర్స్ ను లా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రైస్ ఫింగర్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యంపిండి – ఒక కప్పు, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, కాళోంజి సీడ్స్ – అర టీ స్పూన్,తరిగిన కరివేపాకు – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, పుల్లటి పెరుగు – అర కప్పు, నీళ్లు – అర కప్పు, నెయ్యి లేదా బటర్ – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
రైస్ ఫింగర్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యంపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో కారం, ఉప్పు, జీలకర్ర, కాళోంజి సీడ్స్, కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి. తరువాత పెరుగు వేసి కలపాలి. దీనిని చేత్తో బాగా కలుపుకున్న తరువాత ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే నెయ్యి లేదా బటర్ వేసి కలపాలి. నీళ్లు వేడయ్యాక పిండి వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకుంటూ చిన్న మంటపై వేడి చేయాలి. పిండి చక్కగా కలిసిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత చేత్తో వత్తుతూ బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తరువాత చేతులకు నూనె రాసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఫింగర్స్ లాగా చుట్టుకోవాలి. మనకు నచ్చిన పరిమాణంలోఈ ఫింగర్స్ ను తయారు చేసుకోవచ్చు. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఫింగర్స్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై క్రిస్పీగా, ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రైస్ ఫింగర్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తినవచ్చు. లేదంటే నేరుగా ఇలాగే తినవచ్చు. ఈ రైస్ ఫింగర్స్ ను పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.