Rubbu Talimpu : మనం చక్కటి ఆరోగ్యం కోసం చిన్న తోటకూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చిన్న తోటకూరను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కంటి చూపును మెరుగుపరచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, రక్తహీనతను తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా ఈ తోటకూర మనకు దోహదపడుతుంది. ఈ చిన్న తోటకూరతో ఎక్కువగా మనం వేపుడును తయారు చేస్తూ ఉంటాము. కేవలం వేపుడే కాకుండా దీనితో మనం రుబ్బు తాళింపును కూడా తయారు చేసుకోవచ్చు. దీనినే తోటకూర పులుసు అని కూడా అనవచ్చు. ఈ కూరను పాతకాలంలో ఎక్కువగా తయారు చేసేవారు. ఈ రుబ్బు తాళింపు కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. చిన్న తోటకూరతో రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించేలా రుబ్బు తాళింపును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రుబ్బు తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న తోటకూర – 4 కట్టలు ( మధ్యస్థంగా ఉన్నవి), కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన టమాటాలు – 2, ఉప్పు – తగినంత, కారం -ఒక టేబుల్ స్పూన్, పసుపు -పావు టీ స్పూన్, నీళ్లు – అర కప్పు, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – 4 టేబుల్ స్పూన్స్, మెంతులు – పావు టీ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, కరివేపాకు – ఒక రెమ్మ.
రుబ్బు తాళింపు తయారీ విధానం..
ముందుగా తోటకూరను శుభ్రంగా కడిగి కాడలతో సహా చిన్నగా తరగాలి. తరువాత దీనిని కళాయిలోకి తీసుకుని అందులో చింతపండు రసం తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి మూత పెట్టి ఉడికించాలి. తోటకూర చక్కగా ఉడికి నీరంతా పోయిన తరువాత పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. తరువాత ఇందులో చింతపండు రసం, తగినన్ని నీళ్లు పోసి మరో 4 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని ముందుగా ఉడికించిన కూరలో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రుబ్బు తాళింపు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చిన్న తతోటకూరతో తయారు చేసిన ఈ పులుసును తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.