Saggubiyyam Java : వేసవికాలంలో శరీరం డీ హైడ్రేషన్ కు గురి కాకుండా చూసుకోవడం చాలా అవసరం. అలాగే ఎండ వల్ల శరీరం కోల్పోయిన శక్తిని అందించడం కూడా చాలా అవసరం. ఇటువంటి సమయంలో నీటితో పాటు శరీరానికి శక్తినిచ్చే పానీయాలను తీసుకోవాలి. ఎండ వల్ల శరీరం కోల్పోయిన శక్తిని అందించడంలో మనకు సగ్గుబియ్యం జావ ఎంతో సహాయపడుతుంది. సగ్గు బియ్యం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. వీటితో జావ చేసుకుని తాగడం వల్ల శరీరానికి చలువ చేయడంతో పాటు వేసవికాలంలో వచ్చే వివిధ రకాల జీర్ణసమస్యలు కూడా తగ్గుతాయి. శరీరానికి చలువ చేసే సగ్గు బియ్యం జావను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గుబియ్యం జావ తయారీకి కావల్సిన పదార్థాలు..
సగ్గు బియ్యం – 4 టేబుల్ స్పూన్స్, కాచి చల్లార్చిన పాలు – అర కప్పు, పంచదార – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – చిటికెడు.
సగ్గుబియ్యం జావ తయారీ విధానం..
ముందుగా సగ్గు బియ్యాన్ని 3 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఒక గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక సగ్గు బియ్యాన్ని వేసి మెత్తగా ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ సగ్గు బియ్యాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. సగ్గుబియ్యం చల్లారిన తరువాత ఉప్పు, పంచదార వేసి కలపాలి. అలాగే పాలు పోసి కలపాలి. ఇలా చేయడం వల్ల సగ్గుబియ్యం జావ తయారవుతుంది. ఇందులో పాలకు బదులుగా మజ్జిగను కూడా వేసుకోవచ్చు. వేసవికాలంలో ఈ జావను తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. వేసవికాలంలో వచ్చే నీళ్ల విరోచనాల సమస్యతో బాధపడే వారు ఈ జావలో మజ్జిగను కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. విరోచనాలు తగ్గడంతో పాటు శక్తి కూడా లభిస్తుంది.