Sanna Karappusa Undalu : మనం రకరకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. మనం సులభంగా చేసుకోదగిన పిండి వంటకాల్లో సన్నకారపూస ఉండలు కూడా ఒకటి. కారపూసతో చేసే ఈ ఉండలు చాలా రుచిగా ఉంటాయి. ఎవరైనా ఈ ఉండలను సులభంగా తయారు చేసుకోవచ్చు. సన్నకారపూస ఉండలు తయారీ విధానాన్ని.. అలాగే తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సన్నకారపూస ఉండలు తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, నూనె – డీప్ ప్రైకు సరిపడా, బెల్లం తురుము – ఒక కప్పు, నీళ్లు – పావు కప్పు, దంచిన యాలకులు – 3.
సన్నకారపూస ఉండలు తయారీ విధానం..
ముందుగా శనగపిండిని, బియ్యం పిండిని జల్లించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జంతికల గొట్టాన్ని తీసుకుని దానికి నూనె రాయాలి. తరువాత ఇందులో సన్న చిల్లులు ఉన్న బిళ్లను ఉంచి తగినంత పిండిని ఉంచాలి. ఇప్పుడు నూనెలో కారపూసను వత్తుకోవాలి. ఈ కారపూసను మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత వాటిని ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో బెల్లం తురుము, నీళ్లు వేసి వేడి చేయాలి. బెల్లం కరిగి ముదురు పాకం వచ్చే వరకు దీనిని ఉడికించాలి.
ఇలా ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే ముందుగా తయారు చేసుకున్న కారం పూసను వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత చేత్తో ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల సన్నకారపూస ఉండలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఈ కారపూస ఉండలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.