Sesame Pulao : నువ్వులు.. ఇవి మనందరికి తెలిసినవే. వీటిని కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. నువ్వుల్లో ఎన్నో విలువైన పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. నువ్వులను వంటల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. నువ్వులతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. నువ్వులతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో నువ్వుల రైస్ కూడా ఒకటి. ఈరైస్ ను మనం పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎంతో కమ్మగా ఉండే నువ్వుల రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వుల రైస్ తయారీకి కావల్సి పదార్థాలు..
మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, నువ్వులు – 3 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 2, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – పావు టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, ఉప్పు – తగినంత, బియ్యం – ఒకటిన్నర కప్పు.
నువ్వుల పులావ్ తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం వండుకోవాలి. అన్నం పొడి పొడిగా ఉండేలా చేసుకోవాలి. తరువాత కళాయిలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండు కొబ్బరి ముక్కలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఈ దినుసులను జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత ఆవాలు, ఇంగువ వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి.
ఈపొడిని ఒక నిమిష్ పాటు వేయించిన తరువాత అన్నంవేసి కలపాలి. అన్నం అంతా కలిసే వరకు బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నువ్వుల రైస్ తయారవుతుంది.దీనిని పెరుగుతో లేదా మసాలా కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ వంటకం చాలా చక్కగా ఉంటుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.