Sorakaya Pachadi : మనం వంటలను తయారు చేయడానికి ఉపయోగించే కూరగాయలలో సొరకాయ ఒకటి. సొరకాయను ఉపయోగించి మనం రకరకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. సాంబర్ తయారీలో కూడా సొరకాయ ముక్కలను వేస్తూ ఉంటాం. మనం సొరకాయను ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, అధిక బరువును తగ్గించుకునేందుకు.. సొరకాయ ఎంతో ఉపయోగపడుతుంది.
సొరకాయను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. సొరకాయతో కూరలనే కాకుండా పచ్చడిని కూడా చాలా మంది తయారు చేస్తూ ఉంటారు. ఈ సొరకాయ పచ్చడిని రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారికీ కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
సొరకాయ ముక్కలు – ఒక కప్పు, పచ్చి మిరపకాయలు – 8, తరిగిన టమాట – 1 (పెద్దది), ధనియాలు – ఒక టీ స్పూన్, వేయించిన నువ్వులు – 3 టీ స్పూన్స్, ఉప్పు – రుచికి తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 5, నూనె – 4 టీ స్పూన్స్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఇంగువ – చిటికెడు, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపపప్పు – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, నూనె – 2 టీ స్పూన్స్.
సొరకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడయ్యాక ధనియాలు, జీలకర్ర, పచ్చి మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత టమాట ముక్కలను వేసి కలిపి మూత పెట్టి టమాటాలు పూర్తిగా ఉడికే వరకు ఉంచి వీటన్నింటినీ ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారే వరకు ఉంచాలి. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి కాగిన తరువాత సొరకాయ ముక్కలు, పసుపు వేసి కలిపి మూత పెట్టకుండా సొరకాయ ముక్కలను ఉడికించి చల్లారే వరకు ఉంచాలి.
ఒక జార్ లో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చి మిరపకాయలు, టమాటలన్నింటినీ వేయాలి. వీటితోపాటు ఉప్పును, నువ్వులను వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చల్లార బెట్టిన సొరకాయ ముక్కలను వేసి మళ్లీ మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నం, దోశ, ఊతప్పం వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉండడంతోపాటు సొరకాయ వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.