Sorakaya Shanaga Pappu Kura : సొరకాయతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. సొరకాయతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. అలాగే సొరకాయ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇతర కూరగాయలతో చేసినట్టుగా మనం సొరకాయతో కూడా శనగపప్పును కలిపి వండుకోవచ్చు. సొరకాయ, శనగపప్పు కలిపి చేసే ఈ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని చాలా తక్కవు సమయంలో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ సొరకాయ శనగపప్పు కూరను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ శనగపప్పు కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన సొరకాయ – 1, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన టమాటాలు – 2, నానబెట్టిన శనగపప్పు – ఒక కప్పు, పచ్చిమిర్చి – 15 లేదా తగినన్ని, కరివేపాకు – ఒక రెమ్మ, జీలకర్ర – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 7, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – ముప్పావు కప్పు, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
సొరకాయ శనగపప్పు కర్రీ తయారీ వవిధానం..
ముందుగా జార్ లో పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించిన తరువాత పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత సొరకాయ ముక్కలు, శనగపప్పు వేసి కలపాలి.
వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత నీళ్లు, గరం మసాలా వేసి కలపాలి.తరువాత మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ఆవిరి పోయిన తరువాత మూత తీసి పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. పప్పు ఉడకకపోతే మూత పెట్టి మరో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ శనగపప్పు కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.