Sorakaya Ullikaram : సొర‌కాయ ఉల్లికారం ఇలా చేయండి.. అన్నంలో నెయ్యితో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Sorakaya Ullikaram : సొర‌కాయ.. మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో ఇది కూడా ఒక‌టి. సొర‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. సొర‌కాయ‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. సొర‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో సొర‌కాయ ఉల్లికారం కూడా ఒక‌టి. సొర‌కాయ ఉల్లికారం చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ ఇదే కావాలంటారు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ సొర‌కాయ ఉల్లికారాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సొర‌కాయ ఉల్లికారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

లేత సొరకాయ ముక్క‌లు – 4 క‌ప్పులు, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – 3 టేబుల్ స్పూన్స్, మిన‌ప‌ప్పు – 2 టీ స్పూన్స్, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 10, త‌రిగిన పెద్ద ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ట‌మాటాలు – 3, బెల్లం త‌రుగు – ఒక టేబుల్ స్పూన్, నాన‌బెట్టిన చింత‌పండు – నిమ్మ‌కాయంత‌, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, కారం – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Sorakaya Ullikaram make in this way very easy recipe
Sorakaya Ullikaram

సొర‌కాయ ఉల్లికారం త‌యారీ విధానం..

ముందుగా సొరకాయ ముక్క‌ల‌ల్లో ఉప్పు, ప‌సుపు వేసి క‌లిపి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక శ‌న‌గ‌ప‌ప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత మిన‌ప‌ప్పు, ధ‌నియాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవ‌న్నీ చ‌క్క‌గా వేగిన త‌రువాత జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో మ‌రికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. ట‌మాట ముక్క‌లు ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత జార్ లో వేయించిన ఉల్లిపాయ‌, ట‌మాట ముక్క‌లు, బెల్లం త‌రుగు, నాన‌బెట్టిన చింత‌పండును నీటితో స‌హా వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.

త‌రువాత సొర‌కాయ‌లో ఉండే నీటిని పిండేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర‌, అర టీ స్పూన్ ప‌సుపు, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత సొర‌కాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిని మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌గ్గించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పొడి, ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌లిపి ఉడికించాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సొర‌కాయ ఉల్లికారం త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన సొర‌కాయ ఉల్లికారాన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts