Soyabean Dosa : మనం తరచూ ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్‌లలో దోశలు కూడా ఒకటి. దోశలను చాలా మంది చేసుకుని తింటుంటారు. మసాలా దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ.. ఇలా చేస్తారు. అయితే మీరెప్పుడైనా సోయాబీన్స్ దోశను చేసి తిన్నారా.. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్యకరం కూడా. వీటిని చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే సోయాబీన్స్ దోశలను ఎలా తయారు చేయాలో.. అందుకు ఏమేం పదార్థాలు కావాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
సోయాబీన్స్ దోశల తయారీకి కావల్సిన పదార్థాలు..
సోయాబీన్స్ – ముప్పావు కప్పు, అవిసె గింజలు – 2 టీస్పూన్లు, బియ్యం పిండి – 3 టీస్పూన్లు, పచ్చి మిర్చి – 2, అల్లం – కొద్దిగా, ఉప్పు, నీళ్లు, నూనె – తగినంత.
సోయాబీన్స్ దోశలను తయారు చేసే విధానం..
సోయాబీన్స్, అవిసె గింజలను బాగా కడిగి రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయం వీటిని వడకట్టి మిర్చి, అల్లాన్ని జత చేసి గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే బియ్యం పిండి, ఉప్పు వేసి కలిపి దోశలను వేయాలి. ఈ దోశలను రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చే వరకు కాల్చాలి. అనంతరం ప్లేట్‌లోకి తీసుకోవాలి. దీంతో ఎంతో రుచికరమైన సోయాబీన్స్ దోశలు రెడీ అవుతాయి. వీటిని ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. ఏదైనా చట్నీతో తింటే ఈ దోశలు ఎంతో రుచిగా ఉంటాయి. తరచూ చేసుకునే సాధారణ దోశలకు బదులుగా వీటిని వేసుకుని తింటే ఓ వైపు రుచితోపాటు మరోవైపు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.