Spring Onion Tomato Curry : మనం కూరలలో ఉల్లిపాయలతోపాటు అప్పుడప్పుడూ ఉల్లికాడలను కూడా వేస్తూ ఉంటాం. ఉల్లిపాయలే కాదు ఉల్లికాడలు కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఉల్లికాడలలో యాంటీ ఇన్ ప్లామేటరీ, యాంటీ వైరల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. వైరస్ ల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా చేయడంలో, కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. కంటి చూపును, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ ఉల్లికాడలు ఉపయోగపడతాయి. ఉల్లికాడలతో కూరను కూడా చేసుకోవచ్చు. టమాటాలను ఉపయోగించి ఉల్లికాడలతో కూరను ఏ విధంగా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లికాడల టమాట కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉల్లి కాడలు – రెండు కట్టలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన టమాటాలు -2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెబ్బ, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, జీలకర్ర – పావు టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, పసుపు – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్.
ఉల్లికాడల టమాట కూర తయారీ విధానం..
ముందుగా ఉల్లికాడలను చిన్నగా తరిగి శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలను, పసుపును వేసి కలిపి మూత పెట్టి టమాట ముక్కలను మెత్తగా ఉడికించుకోవాలి.
టమాట ముక్కలు పూర్తిగా ఉడికిన తరువాత కడిగి ఉంచిన ఉల్లికాడలను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును, కారాన్ని వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు అర టీ గ్లాస్ నీళ్లను పోసి మూత పెట్టి చిన్న మంటపై 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తరువాత ధనియాల పొడి, కొత్తిమీరను వేసి కలిపి 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లికాడల టమాట కూర తయారవుతుంది. దీనిని అన్నంతోపాటు లేదా చపాతీ, పుల్కా, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా ఉల్లికాడలు, టమాటాల వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.