Sprouted Ragi Malt : చిరు ధాన్యాలైన రాగులను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. రాగులను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రాగులను పిండిగా చేసి రొట్టె, సంగటి వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. అలాగే రాగులతో మనం రాగి మాల్ట్ ను కూడా తయారు చేస్తూ ఉంటాం. రాగి మాల్ట్ ను తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే దీనిని తాగడం వల్ల శరీరానికి కూడా చలువ చేస్తుంది. వేసవికాలంలో దీనిని తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. రాగి మాల్ట్ ను తయారు చేసుకోవడానికి కావల్సిన పిండిని అలాగే ఆ పిండితో రాగి మాల్ట్ ను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి మాల్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగులు – కిలో, బార్లీ గింజలు – అర కప్పు, బాదంపప్పు – ఒక కప్పు, పాలు – పావు లీటర్, బెల్లం తరుగు – రుచికి తగినంత.
రాగి మాల్ట్ తయారీ విధానం..
ముందుగా రాగులను శుభ్రంగా కడగాలి. తరువాత వాటిలో నీళ్లు పోసి 8 నుండి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత వీటిని ఒక వస్త్రంలోకి తీసుకుని మూట కట్టాలి. తరువాత ఈ మూటను గాలి తగలకుండా ఉంచాలి. ఇలా ఒక రోజంతా ఉంచాలి. మరుసటి రాగులు చక్కగా మొలకెత్తుతాయి. తరువాత ఈ మొలకెత్తిన ఈ రాగులను ఎండలో ఎండబెట్టాలి. ఇవి పూర్తిగా ఎండిన తరువాత కళాయిలో వేసి వేయించి డబ్బాలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో బాదంపప్పు, బార్లీ గింజలు కూడా వేసి దోరగా వేయించాలి. వీటిని కూడా రాగుల్లో వేసి మర పట్టించాలి. ఇలా చేయడం వల్ల రాగి మాల్ట్ కు కావల్సిన పిండి తయారవుతుంది. ఇది ఆరు నెలల పాటు తాజాగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండితో రాగి మాల్ట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల రాగి మాల్ట్ పిండిని తీసుకోవాలి.
తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. పాలు ఒక పొంగు వచ్చిన తరువాత ముందుగా తయారు చేసుకున్న పిండిని వేసి కలపాలి. దీనిని 3 నుండి 4 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాలు కొద్దిగా చల్లారిన తరువాత బెల్లం తురుము వేసి కలపాలి. తరువాత దీనిని గ్లాస్ లో పోసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రాగి మాల్ట్ తయారవుతుంది. దీనిని తాగడం వల్ల వేసవి కాలంలో ఎండు నుండి ఉపశమనం లభించడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. పోషకాహార లోపం తలెత్తకుండా ఉంటుంది. నీరసం, బలహీనత వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.