Pakodi Majjiga Charu : మనం సాయంత్రం సమయాల్లో తయారు చేసే స్నాక్స్ వెరైటీలలో పకోడీలు కూడా ఒకటి. పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. కరకరలాడుతూ రుచిగా ఉండే ఈ పకోడీలను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ పకోడీలను నేరుగా తినడంతో పాటు వీటితో ఎంతో రుచిగా ఉండే మజ్జిగ చారును కూడా తయారు చేసుకోవచ్చు. పకోడీలు వేసి చేసే ఈ మజ్జిగ చారు చాలా కమ్మగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. పకోడీలతో రుచిగా మజ్జిగ చారును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పకోడి మజ్జిగ చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
చిలికిన తాజా పెరుగు – పావు లీటర్, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్, శనగపిండి -ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 1, కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత.
పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – 3 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, సన్నగా పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పకోడి మజ్జిగ చారు తయారీ విధానం..
ముందుగా గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలనన్నీ వేసి కలపాలి. తరువాత ఉల్లిపాయల్లో ఉండే నీటితోనే పిండిని గట్టిగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పకోడీలను వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత పెరుగులో, శనగపిండి, నీరు పోసి కలిపి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. వీటిని మెత్తబడే వరకు వేయించిన తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న మజ్జిగను వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పకోడీలను వేసి కలపాలి. ఈ మజ్జిగ చారును మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పకోడి మజ్జిగ చారు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.