పెద్దలు అందుకే అంటుంటారు. కాలు జారితే తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేము అని. ఈ సామెంత అందరికీ వర్తిస్తుంది. అవును, ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను సునిశితంగా గమనిస్తే ఈ విషయం ప్రస్ఫుటమవుతుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కనుక ఆ నేతలు ఊరుకోరు. వైసీపీ హయాంలో తాము అనుభవించిన క్షోభకు రెట్టింపు బాధ అనుభవించేలా వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడం ఖాయం. గతంలో వైసీపీ చేసింది కూడా అదే. ప్రభుత్వంలోని పార్టీలు మారినప్పుడల్లా జరిగే తంతు ఇదే. అయితే ఎటొచ్చీ అందరూ బాగానే ఉంటారు, కానీ ఏమీ ఆలోచించకుండా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు, నేతలపై అవాకులు, చెవాకులు మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది. అవును, సరిగ్గా సినీ నటి శ్రీరెడ్డి అనుభవిస్తున్నది ఇదే.
వైసీపీ అధికారంలోకి రాలేదు కనుక టీడీపీ కూటమి నేతలు తన పని పడతారు అనుకుందో, మరో విషయమో తెలియదు కానీ శ్రీరెడ్డి మాత్రం కాళ్ల బేరానికి వచ్చేసింది. మంత్రి నారా లోకేష్‌తోపాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోం మంత్రి వంగలపూడి అనిత, పలు టీడీపీ మీడియా చానల్స్, పత్రికలు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు ఆమె బేషరతుగా బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పారు. తాను ఏం మాట్లాడుతున్నానో తెలియకుండా, ముందు వెనుక ఆలోచించకుండా అనుచిత వ్యాఖ్యలు చేశానని, ఇకపై అలాంటి కామెంట్స్ చేయనని, తాను మాట్లాడిన బూతుల వల్ల ఎంతో మంది మనోభావాలు దెబ్బ తిన్నాయో తనకు ఇప్పుడు అర్థం అవుతుందని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. తనను క్షమించాలని లోకేష్‌ను అన్న అంటూ సంబోధిస్తూ శ్రీరెడ్డి క్షమాపణలు కోరింది.
అయితే శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పినప్పటికీ టీడీపీ, జనసేన నేతలు మాత్రం ఆమెపై ఫిర్యాదు చేస్తున్నారు. ఆమె మాట్లాడిన మాటల వల్ల తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని, గతంలోనే ఆమె కామెంట్స్‌పై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, కనుక ఇప్పడైనా పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేయాలని నేతలు కోరుతున్నారు. అయితే ఆమె తీరు మాత్రం కాళ్ల బేరానికి వచ్చినట్లే ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి శ్రీరెడ్డిని అరెస్టు చేస్తారా, విడిచి పెడతారా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది. అయితే ఏ పార్టీ కూడా శాశ్వతంగా అధికారంలో ఉండదు అన్న సత్యాన్ని గ్రహించలేక శ్రీరెడ్డి కాస్త దుందుడుకుగా వ్యవహరించిందని, అందుకనే ఆమె అలా మాట్లాడిందని, అసలు ఆ అవసరమే లేదని కొందరు అంటున్నారు. ఇలా జరిగితే ఎలా అని ముందే ఆలోచించి ఉండాల్సిందని అంటున్నారు.