Suresh Raina : ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు తరఫున ఆడి ఆ జట్టుకు సురేష్ రైనా ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. అయితే అతను ఫిట్ గా లేడని చెప్పి ఆ జట్టు మేనేజ్‌మెంట్ అతన్ని ఇటీవల జరిగిన మెగా వేలంలో కొనుగోలు చేయలేదు. దీంతో చెన్నై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రైనాను తాము ఎందుకు తీసుకోలేదో.. చెన్నై టీమ్ మేనేజ్‌మెంట్ వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ఇకపై చెన్నైకి రైనా ఆడడని తెలిసి ఫ్యాన్స్ ఎంతో నిరాశకు గురవుతున్నారు.
అయితే ఐపీఎల్ కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ రైనాను అతని కనీస ధర రూ.2 కోట్లకు తీసుకుంటుందని అందరూ భావించారు. ఆ జట్టు ఏస్ ప్లేయర్ జేసన్ రాయ్ తప్పుకోవడంతో రైనాను జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ రైనాకు ఆ దారి కూడా మూసుకుపోయింది. దీంతో రైనాకు ఇక ఐపీఎల్‌లోనూ కాలం చెల్లిందని భావిస్తూ వచ్చారు. అయితే రైనా ఈ ఐపీఎల్‌లో ఎట్టకేలకు అడుగు పెట్టనున్నాడు. కానీ ప్లేయర్ గా కాదు.. కామెంటేటర్‌గా.. అవును.. ఐపీఎల్‌లో హిందీ కామెంటరీ చెప్పేందుకు స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ రైనాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇక భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా అందుబాటులో ఉంటున్నాడు కనుక ఆయనతో కూడా కామెంటరీ చెప్పించాలని స్టార్ స్పోర్ట్స్ టీమ్ ఆలోచిస్తోంది. గతంలో రవిశాస్త్రి టీమిండియాకు కోచ్‌గా పనిచేయక ముందు స్టార్ నెట్ వర్క్‌లోనే కామెంటేటర్‌గా పనిచేశారు. అందువల్ల ఆయన మళ్లీ తన పాత ఉద్యోగంలోకి వస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సురేష్ రైనా, రవిశాస్త్రి.. ఇద్దరూ ఈసారి ఐపీఎల్‌లో హిందీ కామెంటరీ చెబుతారని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక వివరాలను ప్రకటించనున్నారు.