Sweet Corn Pulao : రుచిక‌ర‌మైన మొక్క‌జొన్న పులావ్‌.. కేవ‌లం 10 నిమిషాల్లో ఇలా చేసుకోవ‌చ్చు..!

Sweet Corn Pulao : మ‌నం స్వీట్ కార్న్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. స్వీట్ కార్న్ తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. స్వీట్ కార్న్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో కార్న్ పులావ్ కూడా ఒక‌టి. ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. ప్ర‌త్యేక సంద‌ర్భాల‌లో చేసుకోడానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని నిమిషాల వ్య‌వ‌ధిలోనే త‌యారు చేసుకోవ‌చ్చు. వెరైటీగా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా కార్న్ తో పులావ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. స్వీట్ కార్న్ తో చాలా సుల‌భంగా, అలాగే రుచిగా పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కార్న్ పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క‌డిగిన బాస్మ‌తీ బియ్యం -ఒక గ్లాస్, స్వీట్ కార్న్ – ముప్పావు క‌ప్పు, నూనె – 2 టీ స్పూన్స్, నెయ్యి – 2 టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 5, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, బిర్యానీ ఆకులు – 2, త‌రిగిన కొత్తిమీర‌- 2 టీ స్పూన్స్, త‌రిగిన పుదీనా – 2 టీ స్పూన్స్, యాల‌కులు – 3, ల‌వంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, సాజీరా – అర టీ స్పూన్, జాప‌త్రి – కొద్దిగా, అనాస పువ్వు – 1, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్.

Sweet Corn Pulao recipe in telugu very easy to make
Sweet Corn Pulao

కార్న్ పులావ్ త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత జీల‌క‌ర్ర‌, మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ప‌చ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మొక్క‌జొన్న గింజ‌లు, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత బాస్మ‌తీ బియ్యాన్ని వేసి క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత ఒక‌టిన్న‌ర గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి.

త‌రువాత కొత్తిమీర‌, పుదీనా, ఉప్పు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు కుక్క‌ర్ మూత పెట్టి 2 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని ఆవిరి పోయేంత వ‌ర‌కు అలాగే ఉంచి ఆ త‌రువాత అంతా క‌లిసేలా మ‌రోసారి క‌లుపుకుని మ‌రో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కార్న్ పులావ్ త‌యార‌వుతుంది. దీనిని మ‌సాలా కూరలు, రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా స్వీట్ కార్న్ తో చాలా సుల‌భంగా, చాలాత్వ‌ర‌గా పులావ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ పులావ్ చాలా చ‌క్క‌గా ఉంటుంది.

D

Recent Posts