Tacos : టాకోస్.. మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలలో లభించే చిరుతిళ్లల్లో ఇవి కూడా ఒకటి. టాకోస్ క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఈ టాకోస్ ను బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా సులభంగా వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా అందరికి నచ్చేలా ఈ టాకోస్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టాకోస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – 2 కప్పులు, నూనె – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 10 నుండి 15, పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయలు – 2, ఉడికించిన బంగాళాదుంపలు – 3, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, టమాట సాస్ – అర కప్పు, చీజ్ – కొద్దిగా.
టాకోస్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా, మరీ మెత్తగా ఉండకుండా చూసుకోవాలి. పిండి కలిపిన తరువాత దానిపై మరో టీ స్పూన్ నూనె వేసి కలిపి మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చిని వేసి వేయించాలి. ఎండుమిర్చి వేగిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని కొద్దిగా రంగు మారే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత గిన్నెలో వేయించిన ఎండుమిరపకాయలను తీసుకుని చేత్తో మెత్తగా నలుపుకోవాలి. తరువాత ఇందులోనే బంగాళాదుంప ముక్కలను వేసి ఉండలు లేకుండా మెత్తగా చేసుకోవాలి. తరువాత ఇందులోనే ఉప్పు, వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరోసారి బాగా కలుపుకోవాలి. తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత వీటిని పెనం మీద వేసి నూనె వేడయ్యాక 2 నిమిషాల పాటు రెండు వైపులా కాల్చుకోవాలి.
ఇలా అన్నింటిని కాల్చుకున్న తరువాత ఈ చపాతీపై టమాట సాస్ ను రాయాలి. తరువాత చపాతీ సగం భాగంలో చీజ్ ను వేసుకోవాలి. తరువాత ఈ చీజ్ పై బంగాళాదుంప మిశ్రమాన్ని ఉంచాలి. దీనిపై మరికొద్దిగా చీజ్ ను వేసుకోవాలి. ఇప్పుడు చపాతీని మధ్యలోకి మడిచి పక్కకు ఉంచాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న పెనం మీద నూనె వేసి వేడి చేయాలి. పెనం వేడయ్యాక ముందుగా సిద్దం చేసుకున్న టాకోస్ ను పెనం మీద ఉంచాలి. వీటిని నూనె వేస్తూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అలాగే టాకోస్ పక్కలతో పాటు అడుగు భాగాన కూడా మరో నిమిషం పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టాకోస్ తయారవుతాయి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి.