Tandoori Egg Fry : రోజుకో ఉడికించిన గుడ్డును తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చన్న సంగతి మనందరికి తెలిసిందే. కండరాలను బలంగా చేయడంలో, చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ఈ గుడ్లు మనకు ఎంతో దోహదపడతాయి. ఉడికించిన కోడిగుడ్లను నేరుగా తినడంతో పాటు వీటితో రకరకాల వంటకాలను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఉడికించిన కోడిగుడ్లతో చేసుకోదగిన వంటల్లో తందూరి ఎగ్ ఫ్రై ఒకటి. ఇది మనకు బయట రోడ్ల పక్కన బండ్ల మీద ఎక్కువగా దొరుకుతుంది. తందూరి ఎగ్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. తందూరి ఎగ్ ఫ్రై ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తందూరి ఎగ్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 6, మిరియాలు – అర టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, నూనె – 3 టీ స్పూన్స్.
తందూరి ఎగ్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఉడికించిన కోడిగుడ్లపై ఉండే పొట్టును తీసి వాటిని నిలువుగా రెండు భాగాలుగా చేసుకోవాలి. తరువాత ఒక జార్ లో మిరియాలు, ధనియాలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కట్ చేసుకున్న కోడిగుడ్లను వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత కోడిగుడ్లను మరో వైపుకు తిప్పుకుని వేయించాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని కళాయి అంతా చల్లకుండా ఒక్కో కోడిగుడ్డు మీద మాత్రమే చల్లుకోవాలి. దీనిని మరలా మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి.
ఇప్పుడు కోడిగుడ్డును మరో వైపుకు తిప్పి అలాగే మసాలా పొడిని చల్లుకోవాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తందూరి ఎగ్ ఫ్రై తయారవుతుంది. స్నాక్స్ గా లేదా పప్పు, సాంబార్, రసం వంటి వాటిలోకి ఇలా తందూరి ఎగ్ ఫ్రై ను తయారు చేసుకుని తినవచ్చు. ఉడికించిన గుడ్డును నేరుగా తినలేని వారు ఈ విధంగా ఎగ్ ఫ్రైను చేసుకుని తినడం వల్ల గుడ్డులోని పోషకాలను పొందవచ్చు.