Kaliyugam : ప్రస్తుతం మనం అందరం ఉన్నది కలియుగంలోనేనని అందరికీ తెలిసిందే. అయితే ఈ యుగంలోనే యుగాంతం వస్తుందని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే కలియుగంలో మనుషులు ఉన్నతస్థానానికి చేరుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారని, అందుకు అవసరమైతే అడ్డదారులు కూడా తొక్కుతారని, వయసు, ఎత్తు, బలం, జ్ఞానం, ఆకర్షణ వంటివన్నీ రానురాను కలియుగంలో తగ్గిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అవన్నీ జరగడం కూడా మనం చూస్తున్నాం. అయితే వేదాలు కూడా కలియుగం గురించిన కొన్ని నిజాలను మనకు చెబుతున్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కలియుగంలో నిజం అనేది చనిపోతుంది. మనుషులు నిజం చెప్పడం అనేది మానేస్తారు. అబద్దాల మీదనే ప్రపంచం నడుస్తుంది. నిజం చెప్పే ఏ మనిషి కూడా కలియుగంలో ఉండలేడు. ఉండడు కూడా. మనుషుల్లో మంచితనం అనేది అస్సలు ఉండదు. అది చూద్దామన్నా ఏ కోశానా కనిపించదు. ఎక్కడో కోటికొక్కరు మంచి, మానవత్వం ఉన్నవారు ఉంటారు. ఒక మనిషికి ఉన్న గుణ గణాలు, పేరు కాక అతనికి ఉండే ఆస్తి అంటేనే ఇతరులు ఎక్కువగా విలువనిస్తారు. డబ్బును బట్టే మనిషి గుణ గణాలను నిర్ణయిస్తారు. ఆలు, మగల మధ్య నిజమైన ప్రేమ కొరవడుతుంది. వారి మధ్య ఉండేది కేవలం ఆకర్షణ మాత్రమే. ఇది వారి మధ్య ఉన్న సంబంధాలను దెబ్బ తీస్తుంది.
కలియుగంలో తల్లిదండ్రులను మోసం చేసే పిల్లలు, పిల్లలను మోసం చేసే తల్లిదండ్రులు ఉంటారు. మతాలు, కులాలు, వర్గాల పేరుతో మోసాలు జరుగుతాయి. వాటిని అడ్డం పెట్టుకుని కొందరు ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడుతారు. డబ్బే ప్రపంచంగా మారుతుంది. మనుషులు తోటి మనుషుల కన్నా డబ్బుకే ఎక్కువ విలువనిస్తారు. అందులోనే బతుకుతారు. డబ్బున్న వారిదే రాజ్యం అవుతుంది. డబ్బు కోసం బంధువులను, తోటి కుటుంబ సభ్యులను చంపేందుకు కూడా వెనుకాడరు. దొంగలు, దోపిడీదారులు, మోసాలు చేసేవారు, రౌడీలు, గూండాలు రాజ్యమేలుతారు. పాలకులుగా మారి ప్రజలను పట్టి పీడిస్తారు. వారు తాము చేసిందే శాసనం అన్నట్టుగా నియంతృత్వ పాలన సాగిస్తారు.
వృద్ధులైన అమ్మానాన్నలను పిల్లలు పట్టించుకోరు. వారిని నిర్లక్ష్యం చేస్తారు. అస్సలు లెక్క చేయరు. కలియుగం అంతం అవుతుందనగా ఆవులు ఉండవు. చనిపోతాయి. ఎవరికీ కరుణ ఉండదు. ఒకరినొకరు చంపుకునేదాకా వస్తుంది. అందరూ చేపలు మాత్రమే తింటారు. మహిళలు చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు. ఎక్కడ చూసినా వ్యభిచారం, హత్యలు జరుగుతాయి. మనిషి జీవిత కాలం 15 ఏళ్లకు పడిపోతుంది. చిన్న వయస్సులోనే పిల్లలను కంటారు. ఎక్కడా ఆలయాలు ఉండవు. కనుమరుగైపోతాయి. భూమిపై వేడి పెరిగిపోతుంది. అందుకు జీవరాశులు తట్టుకోలేక చనిపోతాయి. దుర్మార్గులందరూ హతమవుతారు. ప్రళయం వచ్చి భూమిపై అంతా ఎటు చూసినా నీరే దర్శనమిస్తుంది. అప్పుడు తిరిగి సత్య యుగం ప్రారంభమవుతుంది.