Tollywood : ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై గత కొద్ది నెలలుగా చర్చోపచర్చలు జరుగుతున్న విషయం విదితమే. టాలీవుడ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు ప్రముఖులు పలు వేదికలపై ఏపీ ప్రభుత్వానికి ఏకరువు పెట్టారు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఇలాగైతే లాభం లేదనుకున్న చిరంజీవి పలుమార్లు సీఎం జగన్‌ను కలిశారు. ఇటీవలే ఇతర హీరోలతోనూ కలసి వెళ్లి ఆయన సీఎం జగన్‌తో సమావేశమై టాలీవుడ్ సమస్యలపై చర్చించారు. దీంతో టాలీవుడ్ కష్టాలు అతి త్వరలోనే గట్టెక్కుతాయని వారికి జగన్ నుంచి ఒక దృఢమైన నమ్మకం లభించింది. అయితే ప్రస్తుతం మా అధ్యక్షుడు మంచు విష్ణు సీఎం వైఎస్ జగన్ తో సమావేశం కావడం అనేక అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.
వాస్తవానికి టాలీవుడ్ సమస్యలపై మా అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు ఏనాడూ ప్రయత్నం చేసింది లేదు. ఒకటి రెండు సార్లు మీడియాతో మాట్లాడి.. తరువాత ప్రకటనలు చేసి ఊరుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం అనేక సార్లు వేదికలపై ఏపీ ప్రభుత్వాన్ని ఈ విషయమై విజ్ఞప్తి చేశారు. అలాగే సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా కలిశారు. ఈ మధ్యే టాలీవుడ్ ప్రముఖులు కొందరిని వెంటబెట్టుకుని మరీ వెళ్లి జగన్‌ను కలిశారు. దీంతో సమస్యలు పరిష్కారం అవుతాయని వారికి ధీమా లభించింది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో మెగాస్టార్ చిరంజీవి పాత్రే ఉంది. కానీ మంచు విష్ణు లేదా ఆయన తండ్రి మోహన్ బాబు పాత్ర లేదనే చెప్పవచ్చు. వారు చిరంజీవి కన్నా వైసీపీకి అత్యంత సన్నిహితులు. జగన్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిసేంత పలుకుబడి ఉన్నవారు. అయినా టాలీవుడ్ సమస్యలను ముందుండి పరిష్కరించలేకపోయారు. అయితే ఎట్టకేలకు ఇండస్ట్రీ సమస్యలకు తెర పడుతుందని భావిస్తున్న తరుణంలో మంచు విష్ణు జగన్‌ను కలవడం ఆసక్తిని కలిగిస్తోంది. చిరంజీవి ఇప్పటి వరకు పడిన శ్రమను పక్కకు పెట్టి మంచు విష్ణును ఈ విషయంలో హీరోను చేయాలని చూస్తున్నారని.. ఓ వర్గం వారు మండిపడుతున్నారు.
వాస్తవానికి మొదట్నుంచీ ఇండస్ట్రీ సమస్యలపై కృషి చేసింది చిరంజీవే అని చెప్పాలి. కానీ ఇప్పుడు మంత్రి పేర్ని నాని మోహన్ బాబును కలవడం, తరువాత విష్ణు జగన్‌ను కలవడం.. వంటి పరిణామాలు జరుగుతున్నాయి. అంటే రేప్పొద్దున ఏపీ ప్రభుత్వం టాలీవుడ్‌కు అనుకూలంగా జీవోను విడుదల చేస్తే.. అప్పుడు అంతా తామే చేశామని.. చెప్పుకోవడం కోసమే కాబోలు.. ఈ ప్రయత్నాలు.. అన్న మాట కూడా వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ఏపీ ప్రభుత్వం గనుక టాలీవుడ్‌కు అనుకూలంగా జీవో జారీ చేస్తే.. దాని క్రెడిట్ వాస్తవానికి చిరంజీవికే దక్కాలి. కానీ ఇతరులు ఎవరికైనా సరే ఆ క్రెడిట్ దక్కేవిధంగా చేస్తే మాత్రం.. అది సహేతుకం కాదనే చెప్పవచ్చు. మరి జగన్‌ను విష్ణు కలిసిన సమావేశం తాలూకు పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.