Tomato Coriander Chutney : టమాటా, కొత్తిమీర చట్నీ.. ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లతోపాటు అన్నంలోకి కూడా దీన్ని తినవచ్చు..

Tomato Coriander Chutney : ఇడ్లీ, దోశలలోకి సాధారణంగా చాలా మంది ఒకే రకమైన చట్నీలను చేస్తుంటారు. ఈ చట్నీలను అన్నంతో తినలేము. దీంతో ఎక్కువ చట్నీ చేస్తే మిగిలిపోతుంది. కానీ అన్నింటిలోకి వచ్చేలా ఒకేలాంటి చట్నీని మనం తయారు చేయవచ్చు. టమాటా, కొత్తిమీర ఉపయోగించి తయారు చేసే చట్నీ కేవలం టిఫిన్లలోకే కాదు.. అన్నంలోకి కూడా పనికొస్తుంది. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. దేంతోనైనా దీన్ని కలిపి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. టమాటా, కొత్తిమీర చట్నీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

టమాటా, కొత్తిమీర చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..

టమాటాలు – మూడు, కొత్తిమీర – పెద్ద కట్ట, పచ్చి మిర్చి – పది, వేరుశెనగ గుళ్లు – చిన్న కప్పు, జీలకర్ర – ఒక టీస్పూన్‌, వెల్లుల్లి – ఒక రెబ్బ, నూనె – తగినంత, ఉప్పు – రుచికి సరిపడా, చింతపండు – చిన్న నిమ్మకాయ సైజంత.

Tomato Coriander Chutney very easy to make perfect for all types of foods
Tomato Coriander Chutney

తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..

ఆవాలు, జీలకర్ర, మినప పప్పు, శనగ పప్పు – ఒక టీస్పూన్‌ చొప్పున, ఎండు మిర్చి – రెండు, వెల్లుల్లి – ఒక రెబ్బ, కరివేపాకు – ఒక రెబ్బ.

టమాటా, కొత్తిమీర చట్నీని తయారు చేసే విధానం..

ముందుగా బాణలిలో నూనె వేసి వేడి చేసి జీలకర్ర, వెల్లుల్లి, పల్లీలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత టమాటాలు కూడా వేసి వేగనివ్వాలి. చివరగా ఉప్పు కూడా వేసి దించేయాలి. చల్లారాక ఇవన్నీ మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమానికి కొత్తిమీర, చింతపండు కూడా చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి చివర్లో తాళింపు వేస్తే చాలు. ఎంతో రుచికరమైన టమాటా, కొత్తిమీర చట్నీ తయారవుతుంది. దీన్ని రకాల టిఫిన్లతోపాటు అన్నంలోనూ కలిపి తినవచ్చు. కాస్త కారంగా చేసి నెయ్యితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.

Editor

Recent Posts