Tomato Dal : టమాటాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఈ టమాటాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని మనం వెజ్, నాన్ వెజ్ వంటకాల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. టమాటాలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. టమాటాలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో టమాట పప్పు కూడా ఒకటి. టమాట పప్పును తరచూ అందరూ చేస్తూనే ఉంటారు. టమాట పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పును మనం ఎక్కువగా కుక్కర్ లో వేసి చేస్తూ ఉంటాం. కుక్కర్ ను ఉపయోగించకుండా కూడా మనం ఈ పప్పును తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. కుక్కర్ లేకుండా టమాట పప్పును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన టమాటాలు – 5, నానబెట్టిన కందిపప్పు – 150 గ్రా., తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – ఒక రెమ్మ, నూనె – ఒక టేబుల్ స్పూన్.
టమాట పప్పు తయారీ విధానం..
ముందుగా కళాయిలో రెండు గ్లాసుల నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక కందిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. ఈ కందిపప్పును మధ్యస్థ మంటపై కలుపుతూ ఉడికించాలి. పప్పు మెత్తగా ఉడికిన తరువాత టమాట ముక్కలు, చింతపండు రసం, మరో అర గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు టమాట ముక్కలను కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. టమాట ముక్కలు ఉడికిన తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి రెండు నిమిషాల పాటు కలపాలి. తరువాత గంటెతో పప్పులోని నీటిని తీసుకుని వేరే గిన్నెలో పోయాలి. తరువాత పప్పును పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. పప్పును మెత్తగా చేసుకున్న తరువాత పక్కకు తీసిన నీటిని కూడా మరలా పప్పులో పోసి కలపాలి.
తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా ఉడికించిన పప్పును వేసి కలపాలి. ఈ పప్పును మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట పప్పు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కుక్కర్ లో వేసి చేసే పప్పు కంటే ఈ విధంగా చేసిన టమాట పప్పు మరింత రుచిగా ఉంటుంది. ఈ పప్పును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.